
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025కు ముందు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఫ్రాంచైజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. గత ఆరు సీజన్లగా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లెజెండరీ కీరన్ పొలార్డ్ స్దానాన్ని పూరన్ భర్తీ చేయనుంది.
దీంతో టీకేఆర్‌లో కొత్త శకం మొదలు కానుంది. పూరన్ సీఎపీఎల్ తొలి సీజన్(2013)లో టీకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అప్పటిలో ఆ జట్టును ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్ స్టీల్ అని పిలిచేవారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ట్రినిడాడ్ జట్టును కొనుగొలు చేయడంతో టీకేఆర్‌గా మారింది.
అయితే 2015లో ట్రినిడాడ్ నుంచి బయటకు వెళ్లిన పూరన్ బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత తిరిగి సీపీఎల్-2022 సీజన్‌కు ముందు మళ్లీ టీకేఆర్‌తో పూరన్ జతకట్టాడు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం పూరన్ స్పందించాడు.
"ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించడమే అదృష్టంగా భావించాను. ఇప్పుడు ఏకంగా ఈ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించే అవకాశం లభించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. జట్టును విజయపథంలో నడిపించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తాను.
కెప్టెన్‌గా సరైన వ్యూహాలతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఈ కెప్టెన్సీ డ్వేన్ బ్రావో (2013 - 2019) నుంచి పొలార్డ్((2019 - 2024)కు ఇప్పుడు నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. పొలార్డ్ ఇప్పటికి మాతో కలిసి ఆడుతుండడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ ఉన్నారు. వీరి ముగ్గురికి చాలా అనుభవం ఉందని" టీకేర్ రిలీజ్ చేసిన వీడియోలో పూరన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీపీఎల్ సీజన్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: గిల్ ఒక అత్యద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్: యువరాజ్