డైమండ్‌ లీగ్‌ టోర్నీతో నీరజ్‌ సీజన్‌ షురూ; హైదరాబాదీ ధనుశ్‌ శ్రీకాంత్‌కు సువర్ణావకాశం

Neeraj Chopra To Start His Season With Doha Diamond League 2023 - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా ఈ ఏడాది అంతర్జాతీయ సీజన్‌ను డైమండ్‌ లీగ్‌ టోర్నీతో మొదలుపెట్టనున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో నీరజ్‌ పసిడి పతకం గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది డైమండ్‌ లీగ్‌ సీజన్‌లో మొత్తం 14 వన్డే టోర్నీలు ఉన్నాయి. మే 5న దోహాలో తొలి టోర్నీ జరుగుతుంది.  

జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీకి ధనుశ్‌ శ్రీకాంత్‌ 
న్యూఢిల్లీ: జూన్‌ తొలి వారంలో జర్మనీలో జరిగే ప్రపంచకప్‌ జూనియర్‌ షూటింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు.  హైదరాబాద్‌కు చెందిన ధనుశ్‌ శ్రీకాంత్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.

20 ఏళ్ల ధనుశ్‌ 2019లో దోహాలో జరిగిన ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లో... 2021లో పెరూ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. 

విజేత షణ్ముఖ 
ముంబై: అఖిల భారత ‘ఫిడే’ రేటింగ్‌ చెస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ పి.షణ్ముఖ విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో షణ్ముఖతోపాటు విక్రమాదిత్య కులకర్ణి, సౌరవ్‌ ఖేరెడ్కర్‌ 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు.

షణ్ముఖకు టైటిల్‌ ఖరారు కాగా... విక్రమాదిత్య రన్నరప్‌గా, సౌరవ్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఈ టోర్నీలో షణ్ముఖ ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. విజేతగా నిలిచిన షణ్ముఖకు ట్రోఫీతోపాటు రూ. 75 వేలు ప్రైజ్‌మనీగా లభించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top