IND VS Aus 4th Test: అశ్విన్‌, విరాట్‌ ఖాతాలో రికార్డులు

ND VS AUS 4th Test: Ashwin Equals Kallis Record, Virat Equals Kumble Record - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్‌ పేలవ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన విరాట్‌ కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా.. సిరీస్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.

అశ్విన్‌, విరాట్‌లు ఈ అవార్డులకు ఎంపికైన అనంతరం వీరిద్దరి ఖాతాలో వేర్వేరు రికార్డులు వచ్చి చేరాయి. టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్‌ (9 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు).. కల్లిస్‌ను (9) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకగా, భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ (10).. లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేతో (10) సమంగా నిలిచాడు.

టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డుల రికార్డు లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ (11) పేరిట ఉండగా.. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల రికార్డు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (14) పేరిట ఉంది.  సచిన్‌ తర్వాత ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ (11) ఉన్నాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. బౌలర్లకు ఏమాత్రం సహకరించిన పిచ్‌పై నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (90) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్‌ (63) అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. 

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలు చేయగా.. భారత తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (128), విరాట్‌ కోహ్లి (186) శతకాలతో అలరించారు. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top