ఆర్‌సీబీతోనే నా ప్రయాణం

My journey Always With Royal Challengers Bangalore Says Virat Kohli - Sakshi

ఫ్రాంచైజీ మారే యోచనే లేదన్న కోహ్లి

న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును వీడే ప్రసక్తే లేదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. త్వరలో జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఆర్‌సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న కోహ్లి... రానున్న సీజన్‌లో ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఆర్‌సీబీకి విధేయంగానే ఉంటానని చెప్పాడు. ‘ఆర్‌సీబీతో 12 సంవత్సరాలు అద్భుతంగా గడిచాయి.

జట్టులో మా అందరి కోరిక టైటిల్‌ను సాధించడమే. ఈ సీజన్‌ కూడా ఎలా గడిచినా జట్టును వదిలే ప్రసక్తే లేదు. అసలు ఇప్పటివరకు ఆ ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఈసారైనా జట్టు బాగా ఆడుతుందా లేదా అని అభిమానులు ఉద్వేగంగా ఎదురుచూస్తున్నారు. మా ప్రదర్శన ఎలా ఉన్నా మాతో పాటు వారు కూడా ఆర్‌సీబీకి విధేయంగానే ఉంటారు. నేను ఐపీఎల్‌ ఆడుతున్నంతవరకు ఆర్‌సీబీలోనే ఉంటాను’ అని కోహ్లి వెల్లడించాడు. బెంగళూరు తరఫున ఇప్పటివరకు 177 మ్యాచ్‌లాడిన విరాట్‌ 5,412 పరుగులు సాధించాడు. 2016 సీజన్‌లో 973 పరుగుల (4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు)తో ‘ఆరెంజ్‌ క్యాప్‌’ను సొంతం చేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top