ఐపీఎల్‌13 చాంపియన్‌.. ముంబై ఇండియన్స్‌

Mumbai Indians Beat Delhi Capitals By Five Wickets Clinch 5th IPL Title - Sakshi

టైటిల్‌ను నిలబెట్టుకున్న రోహిత్‌ సేన

ఫైనల్లో 5 వికెట్లతో ఢిల్లీపై సునాయాస విజయం

మెరిసిన బౌల్ట్, రోహిత్‌ 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు తుదికంటా అదే జోరును కొనసాగించింది... ఇప్పటి వరకు నాలుగు టైటిల్స్‌తో శిఖరాన నిలబడిన రోహిత్‌ సేన ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలిచి తమ ఘనతను మరింత పదిలం చేసుకుంది. తుది పోరులో ఎక్కడా, ఎలాంటి తడబాటు కనిపించకుండా సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ గత ఏడాది సాధించిన ట్రోఫీని నిలబెట్టుకుంది.

ఐపీఎల్‌ తొలి ఐదు సీజన్లలో ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయిన ముకేశ్, నీతా అంబానీ టీమ్‌... గత ఎనిమిది సీజన్లలో ఐదుసార్లు విజేత స్థానాన్ని అందుకుందంటే లీగ్‌పై ఆ జట్టు ఎంత బలమైన ముద్ర వేసిందో అర్థమవుతుంది. ఆఖరి సమరంలో చక్కటి బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేసిన ముంబై, ఆ తర్వాత అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. సాధారణ స్కోరుకే పరిమితమైన తర్వాత ఇక ప్రత్యర్థిని నిలువరించడం క్యాపిటల్స్‌ వల్ల కాలేదు. పుష్కర కాలం పాటు ప్రయత్నించినా ఫైనల్‌కు చేరడంలో విఫలమైన ఢిల్లీ 13వ ప్రయత్నంలో ఇక్కడి వరకు వచ్చినా... ఈసారి ఆ చిరు సంతృప్తితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత రెండుసార్లు హోరాహోరీ ఫైనల్స్‌లో ఒకే ఒక్క పరుగుతో గట్టెక్కిన ముంబై... ఇప్పుడు ఏకపక్ష విజయంతో దీపావళికి ముందు ‘పాంచ్‌’ పటాకాను పేల్చింది.   

దుబాయ్ ‌: ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్‌ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్‌రేట్‌ల దాగుడుమూతల తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2020 చివరకు కొత్త విజేత రాకుండానే ముగిసింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మళ్లీ  టైటిల్‌ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.


మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్‌ కిషన్‌ (19 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా మెరవడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు విజయం ఖాయమైంది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈసారి ఐపీఎల్‌ విజేత (రూ. 10 కోట్లు), రన్నరప్‌ (రూ. 6 కోట్ల 25 లక్షలు) జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీలో భారీగా కోత విధించాలని  నిర్ణయం తీసుకున్నట్లు గత మార్చిలో బీసీసీఐ తెలిపింది. కానీ మంగళవారం బహుమతి ప్రదానోత్సవంలో మాత్రం అలాంటి మార్పు కనిపించలేదు. గత ఏడాది మాదిరిగానే ఇచ్చినట్టే ఈసారీ అంతే ప్రైజ్‌మనీ ఇచ్చారు. విజేత ముంబై ఇండియన్స్‌ జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. 

కీలక భాగస్వామ్యం... 
ముంబైతో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సున్నాకు 3 వికెట్లు... ఈసారి కొంత మెరుగు! అయినా సరే 22 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకొని ఢిల్లీ కష్టాల్లో పడింది. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే స్టొయినిస్‌ (0) వెనుదిరగ్గా, అజింక్య రహానే (2), శిఖర్‌ ధావన్‌ (15) అనుసరించారు. ఈ దశలో పంత్, అయ్యర్‌ భాగస్వామ్యం క్యాపిటల్స్‌ను నిలబెట్టింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని పంత్‌ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. కృనాల్‌ ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో జోరు చూపించగా... బౌల్ట్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అయ్యర్, పొలార్డ్‌ ఓవర్లో సిక్స్‌ బాది ధాటిని ప్రదర్శించాడు.

అయితే కూల్టర్‌నైల్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్‌... అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. వీరిద్దరు 69 బంతు ల్లో 96 పరుగులు జోడించారు. పంత్‌ అవుటయ్యాక ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా పేలవంగా మారిపోయింది. 15 ఓవర్లలో జట్టు స్కోరు 118/4. మిగిలిన ఐదు ఓవర్లలో చెలరేగితే భారీ స్కోరు సాధ్యమనిపించింది. అయితే ముంబై బౌలర్ల ధాటికి పరుగులు రావడమే గగనంగా మారింది. 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన అయ్యర్‌ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. బుమ్రా వేసిన 17వ ఓవర్లో 11 పరుగులు రావడం మినహా... మిగిలిన నాలుగు ఓవర్లలో ఢిల్లీ 7, 6, 6, 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ షాట్లు ఆడగల హెట్‌మైర్‌ (5) కూడా విఫలం కావడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. 

అలవోకగా... 
ఛేదనలో ముంబై పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. డికాక్‌ (12 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించగా, రోహిత్‌ శర్మ దానిని కొనసాగించాడు. రబడ వేసిన రెండో ఓవర్లో డికాక్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన కెప్టెన్‌ రోహిత్, చివరి పోరులో తన స్థాయిని ప్రదర్శించాడు.

అశ్విన్‌ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్‌తో మొదలు పెట్టిన రోహిత్‌... నోర్జే ఓవర్లో మరో ఫోర్, సిక్స్, ఆ తర్వాత ప్రవీణ్‌ దూబే ఓవర్లో మరో రెండు సిక్సర్లు కొట్టాడు. అనంతరం లేని సింగిల్‌ కోసం ప్రయత్నించిన రోహిత్‌ను రనౌట్‌ నుంచి రక్షించేందుకు సూర్యకుమార్‌ (19) తన వికెట్‌ను త్యాగం చేశాడు. 36 బంతుల్లోనే రోహిత్‌ అర్ధసెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో కిషన్‌ కూడా దూకుడుగా ఆడటంతో ముంబై వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. విజయానికి చేరువైన దశలో రోహిత్, పొలార్డ్‌ (9), హార్దిక్‌ పాండ్యా (3) అవుటైనా... ముంబైకి ఇబ్బంది ఎదురు కాలేదు. నోర్జే వేసిన 19వ ఓవర్‌ నాలుగో బంతిని కవర్స్‌ దిశగా ఆడి కృనాల్‌ సింగిల్‌ తీయడంతో ముంబై జట్టు ఐదోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచింది.

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: స్టొయినిస్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0; ధావన్‌ (బి) జయంత్‌ 15; రహానే (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 2; అయ్యర్‌ (నాటౌట్‌) 65; పంత్‌ (సి) హార్దిక్‌ (బి) కూల్టర్‌నైల్‌ 56; హెట్‌మైర్‌ (సి) కూల్టర్‌నైల్‌ (బి) బౌల్ట్‌ 5; అక్షర్‌ పటేల్‌ (సి) (సబ్‌) అనుకూల్‌ రాయ్‌ (బి) కూల్టర్‌నైల్‌ 9; రబడ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156.  
వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–118; 5–137; 6–149; 7–156.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–30–3; బుమ్రా 4–0–28–0; జయంత్‌ యాదవ్‌ 4–0–25–1;  కూల్టర్‌నైల్‌ 4–0–29–2; హార్దిక్‌ పాండ్యా 3–0–30–0; పొలార్డ్‌ 1–0–13–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) (సబ్‌) లలిత్‌ యాదవ్‌ (బి) నోర్జే 68; డికాక్‌ (సి) పంత్‌ (బి) స్టొయినిస్‌ 20; సూర్యకుమార్‌ (రనౌట్‌) 19; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 33; పొలార్డ్‌ (బి) రబడ 9; హార్దిక్‌ (సి) రహానే (బి) నోర్జే 3; కృనాల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 157.  
వికెట్ల పతనం: 1–45; 2–90; 3–137; 4–147; 5–156.
బౌలింగ్‌: అశ్విన్‌ 4–0–28–0; రబడ 3–0–32–1; నోర్జే 2.4–0–25–2; స్టొయినిస్‌ 2–0–23–1; అక్షర్‌ పటేల్‌ 4–0–16–0; ప్రవీణ్‌ దూబే 3–0–29–0.    

ఐపీఎల్‌–2020 అవార్డులు 
పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ 
ట్రెంట్‌ బౌల్ట్‌ (ముంబై) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌ 
పొలార్డ్‌ (ముంబై)
ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు 

డ్రీమ్‌–11 గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డు 
కేఎల్‌ రాహుల్‌ (పంజాబ్‌)
ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు 

ఫెయిర్‌ ప్లే అవార్డు 
ముంబై ఇండియన్స్‌  

ఆరెంజ్‌ క్యాప్‌ 
(అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌) 
కేఎల్‌ రాహుల్‌


670 పరుగులు 
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

పర్పుల్‌ క్యాప్‌ 
(అత్యధిక వికెట్లు 
తీసిన బౌలర్‌) 

కగిసో రబడ 

30 వికెట్లు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ 
దేవ్‌దత్‌ పడిక్కల్‌ 


473 పరుగులు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 
ప్రైజ్‌మనీ: 
రూ. 10 లక్షలు  

పొలార్డ్‌ ఖాతాలో  15వ టి20 టైటిల్‌... 


ముంబై ఇండియన్స్‌ తాజా ఐపీఎల్‌ టైటిల్‌తో టి20 ఫార్మాట్‌లో అత్యధిక టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా వెస్టిండీస్‌ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ (15 టైటిల్స్‌) గుర్తింపు పొందాడు. 14 టైటిల్స్‌తో డ్వేన్‌ బ్రేవో (వెస్టిండీస్‌) పేరిట ఉన్న రికార్డును పొలార్డ్‌ సవరించాడు.  
పొలార్డ్‌ టైటిల్స్‌ వివరాలు 
5 ఐపీఎల్‌ (ముంబై ఇండియన్స్‌–2013, 2015, 2017, 2019, 2020) 
►2 చాంపియన్స్‌ లీగ్‌ (ముంబై ఇండియన్స్‌–2011, 2013) 
►1 టి20 వరల్డ్‌ కప్‌ (వెస్టిండీస్‌–2012) 
►1 స్టాన్‌ఫోర్డ్‌ టి20 కప్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో–2008) 
►3 కరీబియన్‌ టి20 కప్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో–2011, 2012, 2013) 
►1 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఢాకా గ్లాడియేటర్స్‌–2014) 
►2 కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బార్బడోస్‌ ట్రైడెంట్స్‌–2014; ట్రిన్‌బాగోనైట్‌రైడర్స్‌–2020) 

♦ ‘బ్యాక్‌ టు బ్యాక్‌’ ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన రెండో జట్టు ముంబై ఇండియన్స్‌. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2010, 2011) మాత్రమే ఈ ఘనత సాధించింది.
ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌ రోహిత్‌ శర్మ. ఎమ్మెస్‌ ధోని (204 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌ ఫైనల్లో లక్ష్యాన్ని ఛేజ్‌ చేసి విజేతగా నిలిచిన నాలుగో జట్టు ముంబై ఇండియన్స్‌. గతంలో రాజస్తాన్‌ రాయల్స్‌ (2008లో), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (2012, 2014లో), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2018లో) ఇలా చేశాయి. 
పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో నిలిచిన జట్టు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలువడం ఇది నాలుగోసారి. రాజస్తాన్‌ రాయల్స్‌ (2008లో) ఒకసారి... ముంబై ఇండియన్స్‌ (2017, 2019, 2020) మూడుసార్లు ఈ ఘనత సాధించింది.
ఐపీఎల్‌లో ‘ఆరెంజ్‌ క్యాప్‌’ నెగ్గిన నాలుగో భారత క్రికెటర్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌ (2010), రాబిన్‌ ఉతప్ప (2014), విరాట్‌ కోహ్లి (2016) ఈ ఘనత సాధించారు.  
 

విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో నేను చెప్పాను. కుర్రాళ్లు దానిని చేసి చూపించారు. తొలి బంతి నుంచి ఇప్పటి వరకు మేం టైటిల్‌ లక్ష్యంగానే ఆడాం. సీజన్‌ మొత్తం మాకు అనుకూలంగా సాగింది. బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా ఆడుతుండటంతో అప్పటికప్పుడు  తుది జట్టును మార్చుకునే సౌలభ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ చాలా బాగా ఆడారు. మా విజయంతో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. ఐదో టైటిల్‌ సాధించిన సమయంలో మేం అభిమానుల మధ్య లేకపోవడం నిరాశ కలిగిస్తున్నా వారు వేర్వేరు రూపాల్లో మాకు ఎంతో మద్దతు పలికి  ప్రోత్సహించారు. 


–రోహిత్‌ శర్మ, ముంబై కెప్టెన్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top