WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్‌..

Mumbai Indians beat Delhi Capitals by 7 wickets - Sakshi

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం

‘తొలి’ టైటిల్‌ అందుకున్న హర్మన్‌ బృందం

గెలిపించిన మాథ్యూస్, నాట్‌ సివర్‌   

ముంబై: తొలి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం తుది పోరులోనూ సమష్టి ప్రదర్శనతో అదే జోరును కొనసాగించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా...ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు సాధించింది.

ముంబై బౌలింగ్‌ ధాటికి ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది. కెపె్టన్‌ మెగ్‌ లానింగ్‌ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) మినహా అంతా విఫలం కావడంతో టపటపా వికెట్లు కోల్పోయింది. దాంతో స్కోరు 79/9కు చేరింది. అయితే ఆఖరి వికెట్‌కు రాధ యాదవ్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖా పాండే (17 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగి 24 బంతుల్లోనే అభేద్యంగా 52 పరుగులు జోడించడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు దక్కింది.

అనంతరం ముంబై కూడా 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నాట్‌ సివర్‌ బ్రంట్‌ (55 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు), కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు 74 బంతుల్లో 72 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు.

345  డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మెగ్‌ లానింగ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌) నిలిచింది. ఆమె 9 మ్యాచ్‌లు ఆడి రెండు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 345 పరుగులు సాధించింది. 

16  డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా హేలీ మాథ్యూస్‌ (ముంబై), సోఫీ ఎకెల్‌స్టోన్‌ (యూపీ వారియర్స్‌) నిలిచారు. వీరిద్దరు 16 వికెట్ల చొప్పున తీశారు.   

స్కోరు వివరాలు  : 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (రనౌట్‌) 35; షఫాలీ (సి) కెర్‌ (బి) వాంగ్‌ 11; క్యాప్సీ (సి) అమన్‌జోత్‌ (బి) వాంగ్‌ 0; జెమీమా (సి) మాథ్యూస్‌ (బి) వాంగ్‌ 9; మరిజాన్‌ కాప్‌ (సి) యస్తిక (బి) కెర్‌ 18; జొనాసెన్‌ (సి అండ్‌ బి) మాథ్యూస్‌ 2; అరుంధతి రెడ్డి (సి) ఇషాక్‌ (బి) కెర్‌ 0; శిఖా పాండే (నాటౌట్‌) 27; మిన్ను (సి) యస్తిక (బి) మాథ్యూస్‌ 1; తానియా (బి) మాథ్యూస్‌ 0; రాధ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–35, 4–73, 5–74, 6–75, 7–75, 8–79, 9–79. బౌలింగ్‌: నాట్‌ సివర్‌ 4–0–37–0, ఇసీ వాంగ్‌ 4–0–42–3, సైకా ఇషాక్‌ 4–0–28–0, అమేలియా కెర్‌ 4–0–18–2, హేలీ మాథ్యూస్‌ 4–2–5–3. 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ (సి) అరుంధతి (బి) జొనాసెన్‌ 13; యస్తిక (సి) క్యాప్సీ (బి) రాధ 4; నాట్‌ సివర్‌ (నాటౌట్‌) 60; హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌) 37; అమేలియా కెర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–95. బౌలింగ్‌: మరిజాన్‌ కాప్‌ 4–0–22–0, రాధ యాదవ్‌ 4–0–24–1, జొనాసెన్‌ 4–0–28–1, శిఖా పాండే 4–0–23–0, అలైస్‌ క్యాప్సీ 3.3–0–34–0. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top