Mithali Raj: నా పరుగుల దాహం తీరనిది

Mithali Raj All Time Leading Scorer In International Womens Cricket - Sakshi

విమర్శకులను పట్టించుకోను

ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా

భారత వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌

వార్సెస్టెర్‌: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ తన పరుగుల దాహం ఇంకా తీరలేదని భారత మహిళా స్టార్‌ క్రికెటర్, టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తెలిపింది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో రాణించి కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత సారథి అద్భుత పోరాటపటిమతో జట్టును గెలిపించింది. ఈ క్రమంలోనే ఆమె అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటలకెక్కింది.

మ్యాచ్‌ అనంతరం వర్చువల్‌ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘ఈ సుదీర్ఘ పయనం అంత సులువుగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదుడుకులు అన్నింటినీ తట్టుకున్నాను. అయినా ఎందుకనో... కొన్నిసార్లు వీడ్కోలు చెప్పాలని అనిపించిన ప్రతీసారి ఏదో శక్తి నన్ను బలంగా ముందుకు సాగేలా చేసింది. అందువల్లే 22 ఏళ్ల పాటు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే ఉన్నాను. ఇన్నేళ్లు ఆడినా కూడా నా పరుగుల దాహం, పరుగులు చేయాలనే తపన నానాటికీ పెరుగుతూనే ఉంది. టీమిండియాకు ఇంకా ఎన్నో విజయాలు అందించాలనే పట్టుదల అలాగే ఉంది. మారిన పరిస్థితులు, ప్రత్యర్థి బౌలర్ల ఎత్తుగడల నేపథ్యంలో బ్యాటింగ్‌లో మార్పుచేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నేను వాటి మీదే దృష్టి పెట్టాను’ అని 38 ఏళ్ల మిథాలీ వివరించింది. తన స్ట్రయిక్‌ రేట్‌పై విమర్శించే వారితో తనకు పనిలేదని చెప్పింది.

‘గతంలో నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా... నేనెపుడు విమర్శకుల్ని పట్టించుకోను. నా స్ట్రయిక్‌ రేట్‌పై వారి వ్యాఖ్యల్ని కూడా పరిగణించను. ఏళ్ల తరబడి ఆడతున్న నాకు వాళ్ల ధ్రువీకరణ అక్కర్లేదు. క్రీజులో బ్యాటింగ్‌ చేసే సమయంలో నాకు ఎదురయ్యే బౌలర్లపై కన్నేయాలి. షాట్ల ఎంపిక, బంతిని ఎక్కడకు పంపించి పరుగులు తీయాలనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇతరత్రా అంశాలతో నాకు పనిలేదు. నేనేంటో... నాపై జట్టు బరువుబాధ్యతలెంటో నాకే బాగా తెలుసు’ అని ఘాటుగా స్పందించింది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. ఈ పర్యటనలో చివరిదైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఈనెల 9న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top