
బెల్జియం గ్రాండ్‌ప్రి
స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ 1 నిమిషం 40.562 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. 2012లో జాన్సన్ బటన్ తర్వాత బెల్జియం గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ దక్కించుకున్న తొలి మెక్‌లారెన్ డ్రైవర్‌గా నోరిస్ నిలిచాడు.
మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 నిమిషం 40.647 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానం దక్కించుకోగా... ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ 1 నిమిషం 40.903 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (1 నిమిషం 40.903 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 41.939 సెకన్లు) 16వ స్థానానికి పరిమితమయ్యాడు.
అంతకుముందు జరిగిన స్ప్రింట్ రేస్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 24 రేసులో తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 12 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో పియాస్ట్రి 241 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 232 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ 173 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.