పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌? | Massive Sacking In Pakistan Cricket Loading After Loss To Bangladesh In 1st Test: Report | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

May 13 2026 7:36 PM | Updated on May 13 2026 8:10 PM

Massive Sacking In Pakistan Cricket Loading After Loss To Bangladesh In 1st Test: Report

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 104 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్ చేతిలో వరుసగా మూడో టెస్టు మ్యాచ్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను తొలగించి, తిరిగి బాబర్ ఆజంకు పగ్గాలు అప్పగించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. "బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టాలని జట్టులో కొంత మంది ఆటగాళ్లు కోరుకుంటున్నారు. అంతేకాకుండా  బోర్డు అధికారుల మద్దతు కూడా అతడికి ఉంది. బాబర్ కూడా తిరిగి బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. 

కాగా బాబర్ ఆజం మోకాలి గాయం కారణంగా బంగ్లాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో మే 18 నుండి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో దుమ్ములేపిన బాబర్‌.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తాడని పీసీబీ ఆశిస్తోంది. 

రెండో టెస్టు తర్వాత అతడిని తిరిగి టెస్టు కెప్టెన్‌గా పీసీబీ నియమించే అవకాశముంది.  బాబర్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించడమే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ నాటికి అతడిని వన్డే కెప్టెన్‌గా కూడా సిద్ధం చేయాలని పీసీబీ భావిస్తోంది. 2019 నుండి 2023 వరకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. 

కానీ టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు మళ్లీ పాక్‌ టీ20 కెప్టెన్‌గా బాబర్‌ బాధ్యతలు చేపట్టాడు. ఆ టోర్నీలో పాక్‌ దారుణ ప్రదర్శన కనబరచడంతో బాబర్‌ మళ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. అయితే మళ్లీ ఇప్పుడు అనుహ్యంగా కెప్టెన్‌గా బాబర్‌ పేరును పీసీబీ పరిశీలిస్తోంది.

ఇక 2023 డిసెంబర్ నుంచి షాన్ మసూద్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఆడిన 15 టెస్టుల్లో 11 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా అతడు విఫలమవుతున్నాడు. దీంతో షాన్ మసూద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement