కేఎల్‌ రాహుల్‌ అవుటైనా సరే.. సంజీవ్‌ గోయెంక రియాక్షన్‌ వైరల్‌! | Sakshi
Sakshi News home page

అవుటైనా సరే.. సంజీవ్‌ గోయెంక రియాక్షన్‌ వైరల్‌! ఇంతలో ఎంత మార్పు!

Published Wed, May 15 2024 1:51 PM

LSG Owner Sanjiv Goenka Meets KL Rahul Yet Again After Loss Pics Viral

రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్‌ చేరింది. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో టాప్‌-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్‌-2024లో మాత్రం ఈ ఫీట్‌ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.

ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్‌ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్‌ వైరల్‌గా మారాయి. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్‌ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్‌ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్‌ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్‌ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.

ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్‌ గోయెంక ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు.

 

 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్‌ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్‌ రాహుల్‌ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు.

 

 

 అదే విధంగా.. షాయీ హోప్‌ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్‌ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్‌ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్‌.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.‌

చదవండి: సీజన్‌ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్‌ రాహుల్‌

 

Advertisement
 
Advertisement
 
Advertisement