ఒర్లాండో (ఫ్లోరిడా): అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం, లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా లెబ్రాన్ ఘనత సాధించాడు. ఆదివారం ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆడటం ద్వారా లెబ్రాన్ జేమ్స్ కెరీర్‌లో 1612 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
30 ఏళ్లుగా ఈ రికార్డు రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్‌లు) పేరిట ఉండగా... దాన్ని లెబ్రాన్ జేమ్స్ బద్దలు కొట్టాడు. ఇప్పటికే ఎన్‌బీఏలో వరుసగా 23 సీజన్‌లు ఆడిన ప్లేయర్‌గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన జేమ్స్... ఒర్లాండో మ్యాచ్‌లో 12 పాయింట్లతో సత్తాచాటాడు. ఫలితంగా హోరాహోరీగా సాగిన పోరులో లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు 105–104 పాయింట్ల తేడాతో ఒర్లాండో మ్యాజిక్‌పై విజయం సాధించింది.


