టీమిండియా క్రికెటర్‌ సంచలన నిర్ణయం | KS Bharat Announced retirement | Sakshi
Sakshi News home page

టీమిండియా క్రికెటర్‌ సంచలన నిర్ణయం

Jun 4 2026 7:31 PM | Updated on Jun 4 2026 7:49 PM

KS Bharat Announced retirement

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ (Kona Srikar Bharat) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

"భారత్ తరఫున ఆడటం నా జీవితంలో అత్యున్నత గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని పేర్కొన్నాడు.

అలాగే తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్‌లో తొలి అవకాశం ఇచ్చిన కోహ్లీకి, టెస్టు అరంగేట్రం కల్పించిన రోహిత్‌కు, ఇండియా-ఏ నుంచి జాతీయ జట్టు వరకు తనను ప్రోత్సహించిన ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.

అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భరత్‌ 82 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్‌లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో భరత్‌ 11 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు.  

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్‌, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తానని భరత్ వెల్లడించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement