కోల్‌కతా... ఇంకా ఉంది!

Kolkata Knight Riders beat Rajasthan Royals by 60 runs  - Sakshi

బాదేసిన మోర్గాన్, పడగొట్టిన కమిన్స్‌

60 పరుగులతో నైట్‌రైడర్స్‌ గెలుపు

ఓటమితో రాజస్తాన్‌ అవుట్‌

దుబాయ్‌: ఆఖరి పోరులో కెప్టెన్‌ మోర్గాన్‌ బ్యాట్‌తో, కమిన్స్‌ బంతితో శివాలెత్తారు. దీంతో కోల్‌కతా 60 పరుగుల తేడాతో రాజస్తాన్‌ను ఓడించి ఇంటికి పంపించింది. కానీ నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇంకా ఖాయం కాలేదు. లీగ్‌లో ముందంజ వేసేందుకు ఆ జట్టు రెండు రోజులు నిరీక్షించాలి. చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాలతో ముడిపడిన భవిష్యత్తు కోసం ఎదురుచూడాలి.

మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీస్కోరు చేసింది. ఇయాన్‌ మోర్గాన్‌ (35 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. బట్లర్‌ (22 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడగా, పవర్‌ప్లేలోనే 4 వికెట్లు పడగొట్టిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్యాట్‌ కమిన్స్‌ (4/34) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.  

శివమెత్తిన మోర్గాన్‌...
నితీశ్‌ రాణా (0), నరైన్‌ (0), దినేశ్‌ కార్తీక్‌ (0) డకౌటైనా కోల్‌కతా స్కోరు హోరెత్తింది. శుబ్‌మన్‌ గిల్‌ (24 బంతుల్లో 36; 6 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ధాటిగా ఆడాడు. రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాక ఇన్నింగ్స్‌ తడబడి ఓ దశలో వందకు (99/5) ముందే సగం వికెట్లను కోల్పోయింది. అయితే మోర్గాన్‌ చెలరేగి 14వ ఓవర్‌ నుంచి కోల్‌కతా బ్యాటింగ్‌ మరో దశకు వెళ్లింది. మోర్గాన్, రసెల్‌ రాయల్స్‌ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు.

శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 14వ ఓవర్లో మోర్గాన్‌ (4, 4, 6, 6) బంతిని నాలుగుసార్లు బౌండరీ దాటించాడు. ఆ తర్వాత రస్సెల్‌ ఆర్చర్‌ ఓవర్లో 4, 6 కొట్టిన అతను, కార్తీక్‌ త్యాగి వేసిన 16వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదేశాడు. మూడో బంతిని కవర్స్‌ మీదుగా ఆడగా... అక్కడ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ మిల్లర్‌ చక్కగా క్యాచ్‌ అందుకోవడంతో రసెల్‌ మెరుపులకు చుక్కెదురైంది. దీంతో తర్వాత రెండు ఓవర్లు జోరు చల్లబడింది. 17, 18వ ఓవర్లలో ఆరేసి పరుగులే వచ్చాయి. కానీ మళ్లీ 19వ ఓవర్లో మోర్గాన్‌... స్టోక్స్‌ను దంచేశాడు. మొదట కమిన్స్‌  సిక్స్‌ కొట్టాడు. తర్వాతి మూడు బంతుల్ని ఆడిన మోర్గాన్‌ 6, 6, 4గా తరలించాడు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 24 పరుగులొచ్చాయి. చివరి 7 ఓవర్లలోనే కోల్‌కతా 91 పరుగులు చేసింది.

సిక్సర్‌తో మొదలై... అంతలోనే కుదేల్‌
భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కమిన్స్‌ తొలి బంతినే ఉతప్ప (6) సిక్సర్‌గా మలిచాడు. తర్వాత స్టోక్స్‌ (18) ఫోర్, సిక్స్‌ బాదాడు. ఐదు  బంతుల్లోనే 19 పరుగులు రాగా, చివరి బంతికి ఉతప్ప ఔటయ్యాడు. కమిన్స్‌ మరుసటి ఓవర్లో స్టోక్స్, కెప్టెన్‌ స్మిత్‌ (4)లను పెవిలియన్‌కు పంపాడు. సామ్సన్‌ (1) శివమ్‌ మావి అవుట్‌ చేయగా... పవర్‌ ప్లేలో మూడో ఓవర్‌ వేసిన కమిన్స్‌... పరాగ్‌ (0)ను డకౌట్‌ చేశాడు. అద్బుతమైన 3–0–29–4 స్పెల్‌తో తన సత్తాను ప్రదర్శించాడు. దీంతో ఐదు ఓవర్లకే సగం వికెట్లు(37/5)ను కోల్పోయిన రాజస్తాన్‌ లక్ష్యానికి దూరమైంది.  బట్లర్, తేవటియా (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌ (23 బంతుల్లో 23; 2 ఫోర్లు) చేసిన పరుగులు... ఆడిన ఆట... రాయల్స్‌ 20 ఓవర్లు పూర్తి చేయడానికే సరిపోయాయి తప్ప గెలిచేందుకు ఏమాత్రం సరిపోలేదు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: శుబ్‌మన్‌ (సి) బట్లర్‌ (బి) తేవటియా 36; రాణా (సి) సామ్సన్‌ (బి) ఆర్చర్‌ 0; త్రిపాఠి (సి) ఉతప్ప (బి) గోపాల్‌ 39; నరైన్‌ (సి) స్టోక్స్‌ (బి) తేవటియా 0; మోర్గాన్‌ (నాటౌట్‌) 68; కార్తీక్‌ (సి) స్మిత్‌ (బి) తేవటియా 0; రసెల్‌ (సబ్‌) మిల్లర్‌ (బి) త్యాగి 25; కమిన్స్‌ (సి) సామ్సన్‌ (బి) త్యాగి 15; నాగర్‌కోటి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191.  
వికెట్ల పతనం: 1–1, 2–73, 3–74, 4–94, 5–99, 6–144, 7–184.
బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–19–1, ఆరోన్‌ 2–0–22–0, గోపాల్‌ 3–0–44–1, స్టోక్స్‌ 3–0–40–0, తేవటియా 4–0–25–3, కార్తీక్‌ త్యాగి 4–0–36–2.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప (సి) నాగర్‌కోటి (బి) కమిన్స్‌ 6; స్టోక్స్‌ (సి) కార్తీక్‌ (బి) కమిన్స్‌ 18; స్మిత్‌ (బి) కమిన్స్‌ 4; సామ్సన్‌ (సి) కార్తీక్‌ (బి) మావి 1; బట్లర్‌ (సి) కమిన్స్‌ (బి) వరుణ్‌ 35; పరాగ్‌ (సి) కార్తీక్‌ (బి) కమిన్స్‌ 0; తేవటియా (సి) కార్తీక్‌ (బి) వరుణ్‌ 31; గోపాల్‌ (నాటౌట్‌) 23; ఆర్చర్‌ (సి) మావి (బి) కమలేశ్‌ 6; త్యాగి (సి అండ్‌ బి) మావి 2; ఆరోన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.4 ఓవర్లలో 9 వికెట్లకు) 131.   
వికెట్ల పతనం: 1–19, 2–27, 3–32, 4–32, 5–37, 6–80, 7–105, 8–125, 9–129.  
బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–34–4, శివమ్‌ మావి 4–1–15–2, వరుణ్‌ 4–0–20–2, నరైన్‌ 4–0–37–0, నాగర్‌కోటి 4–0–24–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top