తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి

Kohli says He Was Scared Before First Training Session - Sakshi

మొత్తానికి ప్రాక్టీస్‌ బాగుంది

దుబాయ్‌: భారత కెప్టెన్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చాన్నాళ్ల తర్వాత నెట్స్‌లో దిగిన తనకు తొలిబంతిని ఎదుర్కొన్నప్పుడు కాస్త ఉత్తంఠ అనిపించిందని చెప్పాడు. మొత్తానికి తన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌  అనుకున్నదానికంటే బాగానే జరిగిందని అన్నాడు. కరోనా మహమ్మారి వల్ల అందరిలాగే ‘స్టే హోమ్‌–స్టే సేఫ్‌’ అయిపోయిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఐదు నెలల తర్వాత ఐపీఎల్‌ కోసం ఆదివారం సన్నాహాలు మొదలుపెట్టాడు. ‘నిజాయితీగా చెబుతున్నా... తొలిబంతి బాదేందుకు ముందు కాస్త భయపడిన మాట నిజం. ఎందుకంటే గత ఐదు నెలలుగా నేను అసలు బ్యాటే పట్టలేదు. అయితే ప్రాక్టీస్‌ మాత్రం ఆశించినదానికంటే అద్భుతంగానే సాగింది’ అని విరాట్‌ ఫ్రాంచైజీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. (చదవండి:హోటల్‌ గది’ కారణమా..!)

లాక్‌డౌన్‌లో ఆటకు దూరమైనప్పటికీ జిమ్‌లో క్రమం తప్పకుండా కసరత్తు చేయడం వల్లే శరీరం బాగా సహకరిస్తోందని చెప్పాడు. స్పిన్నర్లు చహల్, వాషింగ్టన్‌ సుందర్, నదీమ్‌ కొందరు పేసర్లు నెట్స్‌లో పాల్గొన్నారు. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్‌లో చక్కగా చెమటోడ్చారని, బంతిని సరైన దిశలో తిప్పుతున్నారని కోహ్లి తెలిపాడు.   నెట్స్‌ సెషన్‌లో సఫారీ పేస్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ కూడా పాల్గొనగా... ఆర్‌సీబీ జట్టు డైరెక్టర్‌ మైక్‌ హెస్సన్‌ ప్రాక్టీస్‌ను పరిశీలించారు. గతవారం దుబాయ్‌కి వచ్చిన బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపింది. పన్నెండు సీజన్లుగా జరుగుతున్న ఈ టోర్నీలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలుచుకోలేకపోయింది.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా... 
ఇక్కడి ఐసీసీ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు కూడా తొలి ప్రాక్టీస్‌ సెషన్లో ఉత్సాహంగా గడిపారు. క్యాపిటల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మాట్లాడుతూ ‘చాన్నాళ్ల తర్వాత అందరం జట్టుకట్టాం. అందరిలోనూ సత్తాచాటాలనే ఉత్సాహం ఉంది. సానుకూలంగా సీజన్‌ను ప్రారంభించి ఈ టోర్నీలో తప్పకుండా రాణిస్తాం’ అని అన్నాడు. తామిక్కడికి వచ్చి కేవలం ఆరు రోజులే అయిందని... ఈ వేడి వాతావరణానికి అలవాటు పడాలంటే ఇంకా రెండుమూడు రోజులైనా పడుతుందని శిఖర్‌ చెప్పాడు.(చదవండి:కెప్టెన్‌గా ఈ లీగ్ నాకు చాలా ప్ర‌త్యేకం : అయ్యర్)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top