KL Rahul To Virat Kohli List Of 7 Cricketers Who Married Bollywood Actresses - Sakshi
Sakshi News home page

మైదానంలో ‘కింగ్‌’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!

Published Wed, Jan 25 2023 11:12 AM | Last Updated on Wed, Jan 25 2023 1:14 PM

KL Rahul Athiya Shetty: 7 Cricketers Who Married Bollywood Actresses - Sakshi

మన దేశంలో రెండు వినోద ప్రధానాంశాలు.. క్రికెట్‌- సినిమా. చాలా మంది క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తే.. సినిమాను ప్రేమించే వాళ్లూ కోకొల్లలు. ఈ రెండిటి మధ్య.. ముఖ్యంగా బాలీవుడ్‌- క్రికెట్‌ మధ్య  విడదీయరాని అనుబంధం ఉందని ఇప్పటికే ఆయా రంగాల సెలబ్రిటీలు పలువురు నిరూపించారు. 

ప్రేమ పక్షుల్లా విహరిస్తూ పాపరాజీలకు పని కల్పించిన వారు కొందరైతే.. ప్రణయాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని పెళ్లిపీటలెక్కిన వారు మరికొందరు. ఆ జాబితాలో తాజాగా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌- బీ-టౌన్‌ సెలబ్రిటి అతియా శెట్టి జంట కూడా చేరిన విషయం తెలిసిందే. మరి ఈ ‘లవ్‌బర్డ్స్‌’ కంటే ముందు వివాహ బంధంతో ముడిపడి సక్సెస్‌ అయిన క్రికెట్‌- బాలీవుడ్‌ జోడీలు ఎవరంటే!

Mansoor Ali Khan Pataudi And Sharmila Tagore Photos

మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడ్‌- షర్మిలా ఠాగోర్‌
భారత క్రికెట్‌లో లెజండరీ ఆటగాడిగా పేరొందిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌట్‌ అలియాస్‌ టైగర్‌ పటౌడీ. పిన్న వయసులోనే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన టైగర్‌ మనసును గెలుచుకున్న మహరాణి.. షర్మిలా ఠాగోర్‌.

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆమె.. టైగర్‌ను పెళ్లాడి నవాబుల కోడలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1968లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. కుమారుడు సైఫ్‌ అలీఖాన్‌, కుమార్తెలు సోహా, సబా. 

Harbhajan Singh And Geeta Basra Photos

హర్భజన్‌ సింగ్‌- గీతా బస్రా
భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు భజ్జీ. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన టర్బోనేటర్‌.. 2011 ప్రపంచకప్‌ విజయంలో తన వంతు సాయం చేశాడు.

తన ఆటతో అభిమానులను ముగ్ధుల్ని చేసిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌.. బాలీవుడ్‌ నటి గీతా బస్రా కొంటెచూపులకు బౌల్డ్‌ అయ్యాడు. ది ట్రెయిన్‌, దిల్‌ దియా హై వంటి సినిమాల్లో నటించిన గీతను 2015లో పంజాబీ సంప్రదాయంలో అంగరంగవైభవంగా పెళ్లాడాడు. వీరికి కుమార్తె హినయ హీర్‌ ప్లాహా, కుమారుడు జోవన్‌వీర్‌ సింగ్‌ ప్లాహా సంతానం.

Yuvraj Singh And Hazel Keech Photos

యువరాజ్‌ సింగ్‌- హాజిల్‌ కీచ్‌
టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించి కెరీర్‌లో శిఖరాగ్రాలను చూసిన యువరాజ్‌ సింగ్‌- నటి హాజిల్‌ కీచ్‌ ప్రేమ ముందు మాత్రం తలవంచాడు. క్యాన్సర్‌ బాధితుడైన యువీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హాజిల్‌.. 2016లో అతడితో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టింది.

వీరి ప్రేమకు గుర్తుగా కుమారుడు ఓరియన్‌ ఉన్నాడు. కాగా సల్మాన్‌ ఖాన్‌- కరీనా కపూర్‌ జంటగా నటించిన బాడీగార్డ్‌ సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా హాజిల్‌ నటించింది.

Zaheer Khan And Sagarika Ghatge Photos

జహీర్‌ ఖాన్‌- సాగరికా ఘట్కే
టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్‌ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున మూడు వందల వికెట్లు తీసిన జాక్‌.. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడే జహీర్‌ ఖాన్‌.. 2017లో స్వయంగా తనే తన వివాహ ప్రకటన చేశాడు. బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్కేను ప్రేమించి పెళ్లాడనున్నట్లు వెల్లడించాడు. హాకీ నేపథ్యంలో సాగే ‘చక్‌ దే ఇండియా’ సినిమాలో ప్రీతి పాత్రలో నటించిన అమ్మాయే సాగరిక!

Virat Kohli And Anushka Sharma Photos

విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ
టీమిండియా స్టార్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ షాంపూ యాడ్‌లో అనుష్కను చూసిన ఈ పరుగుల వీరుడు తన మనసు పారేసుకున్నాడు.

తమ బంధాన్ని బాహాటంగానే ప్రకటించిన విరుష్క జోడీ.. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017 డిసెంబరులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి దాంపత్యానికి గుర్తుగా కుమార్తె వామిక జన్మించింది.

Hardik Pandya And Natasa Stankovic Photos

హార్దిక్‌ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌
టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. ఐపీఎల్‌లో ముంబై ఇం‍డియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ పాండ్యా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

అరంగేట్ర సీజన్‌లోనే తమ జట్టును విజేతగా నిలిపి.. భారత జట్టులో పునరాగమనం చేయడంతో పాటుగా భవిష్యత్తు సారథిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇక హార్దిక్‌ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సెర్బియా మోడల్‌, బీ-టౌన్‌ నటి నటాషా స్టాంకోవిక్‌తో ప్రేమలో పడిన అతడు.. 2019లో తనతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు వెల్లడించాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న ఈ జంట.. అంతకంటే ముందే కుమారుడు అగస్త్యకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. కాగా నటాషా ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ సినిమాతో నటిగా గుర్తింపు పొందింది.

KL Rahul And Athiya Shetty Photos

కేఎల్‌ రాహుల్‌- అతియా శెట్టి
టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న కర్ణాటక బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌- బాలీవుడ్‌ వెటరన్‌ నటుడు సునిల్‌ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.

2019లో ప్రేమలో పడ్డ వీళ్లిద్దరు 2021లో తమ బంధం గురించి అందరికీ తెలిసేలా సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఇక రాహుల్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న ఈ జంట.. ఎట్టకేలకు జనవరి 23, 2023లో పెళ్లిపీటలెక్కింది. సునిల్‌ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌజ్‌లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది.

ఇదిలా ఉంటే అజాహరుద్దీన్‌- సంగీత బిజ్లానీ పెళ్లి చేసుకున్నప్పటికీ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఇక రవిశాస్త్రి- అమృతా సింగ్‌, సౌరవ్‌ గంగూలీ- నగ్మా, రవిశాస్త్రి- నిమ్రత్‌ కౌర్‌ తదితరుల పేర్లు జంటలుగా వినిపించినప్పటికీ వీరి కథ సుఖాంతం కాలేదు.
-వెబ్‌డెస్క్‌

చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు
అర్జున్‌ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement