ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రబాడ.. తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఓ చారిత్రక రికార్డును సమం చేశాడు.
ఈ మ్యాచ్‌లో రబాడ తీసిన 3 వికెట్లు పవర్‌ప్లేలో (ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు) వచ్చినవే. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ జాన్సన్ (2013), ట్రెంట్ బౌల్ట్ (2020)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 17 వికెట్లతో మహ్మద్ షమీ (2023) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. షమీ పేరిట ఉన్న ఈ రికార్డును రబాడ ఈ సీజన్‌లో తప్పక అధిగమించే అవకాశం ఉంది.
అందనంత ఎత్తుకు..!
తాజా ప్రదర్శనతో రబాడ ఈ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. రబాడ తర్వాత ఈ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ (12) ఉన్నాడు. ఆతర్వాతి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ (9), సిరాజ్ (9) నిలిచారు.
ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కొత్త బంతితో రబాడ వేసిన స్పెల్ ఈ సీజన్‌లోనే అత్యంత ప్రమాదకరమైందిగా నిలిచింది. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరణ్ రవిచంద్రన్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపిన రబాడ.. ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్ (4-0-20-3), ప్రసిద్ద్ కృష్ణ (3-0-23-2), సిరాజ్ (3-1-11-1), రషీద్ ఖాన్ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.


