PC: X
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వివాదంలో చిక్కుకున్నాడు. జూనియర్ స్థాయిలో క్రికెట్ సెలక్షన్ ఎంపిక సమయంలో అతడు పుట్టిన తేదీని మార్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, మాజీ డిప్యూటీ ఎస్పీ సుదర్శన్ మెహతా స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ క్రమంలో భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 175 (3) ప్రకారం.. చీటింగ్, ఫ్రాడ్, పుట్టిన తేదీ ఫోర్జరీ తదితర ప్రొవిజన్లకు అనుగుణంగా మన్హాస్‌పై నౌబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పిటిషనర్ అందించిన వివరాల ప్రకారం.. మిథున్ మన్హాస్ జూనియర్ లెవల్, నేషనల్ లెవల్‌లో క్రికెట్ ఆడే సమయంలో వేర్వేరు పుట్టిన తేదీలను నమోదు చేశారు.
పోలీసులకు కోర్టు ఆదేశాలు
సబ్ జూనియర్, జూనియర్ కేటగిరీలలో అర్హత పొందేందుకు ఈ మేరకు అక్రమాలకు పాల్పడ్డాడని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక కోర్టు సెప్టెంబరు 3లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
ఢిల్లీ తరఫున
కాగా 45 ఏళ్ల మిథున్ మన్హాస్ సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్. అయితే, దేశవాళీ క్రికెట్‌లో అతడు ఎక్కువగా ఢిల్లీ జట్టుకు ఆడాడు. కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న మిథ/న్.. 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు కూడా ఉన్నాయి.
ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో 130 మ్యాచ్‌లలో కలిపి మిథున్ 4126 పరుగులు సాధించాడు. అదే విధంగా 91 టీ20 మ్యాచ్‌లు ఆడి 1179 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
కెరీర్ చరమాంకంలో మిథున్ మన్హాస్ 2015లో జమ్మూ కశ్మీర్ క్రికెట్ సబ్ కమిటీ మెంటర్‌గా పనిచేశాడు. ఆ మరుసటి ఏడాది కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన మిథున్.. బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ పనిచేశాడు. అయితే, టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మిథున్.. పెద్దల అండతో ఏకంగా బీసీసీఐ బాస్ అయ్యాడు.


