అప్పుడే అంత తొందర ఎందుకు?: రోహిత్‌

It Is Too Early To Finalise Indias Batting Line Up For T20 World Cup, Rohit - Sakshi

వన్డేల్లో కోహ్లి ఓపెనర్‌గా వస్తాడని అనుకోవడం లేదు

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరీస్‌ను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను టీమిండియా ఖాతాలో వేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 224 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ కోహ్లి(80 నాటౌట్‌; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్ములేపగా, రోహిత్‌ శర్మ(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో అదరగొట్టాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్ని అందించింది. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌(32; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, హార్దిక్‌ పాండ్యా(39 నాటౌట్‌; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టచ్‌లోకి వచ్చాడు. ఆపై ఇంగ్లండ్‌ను 188 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఘన విజయాన్ని సాధించింది.

ఇదిలా ఉంచితే, కోహ్లి ఓపెనింగ్‌ రావడంతో ఇప్పుడు రాహుల్‌ స్థానంపై చర్చ నడుస్తోంది. రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం కూడా అతన్ని వరల్డ్‌ టీ20 జట్టులోకి తీసుకోవడం అనుమానమేనని విశ్లేషణ సాగుతోంది. దీనిపై మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మను ఒక ప్రశ్న అడగ్గా, అటువంటిది ఏమీ ఉండదన్నాడు.  ‘కోహ్లి ఓపెనర్‌గా వచ్చినంత మాత్రానా టీ20ల్లో కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టినట్లు కాదు. టీ20 ప్రపంచకప్ బ్యాటింగ్ లైనప్ గురించి ఇప్పుడే మాట్లాడటం భావ్యం కాదు. అప్పుడే అంత తొందరెందుకు. జట్టుకు కావాల్సిన కూర్పు గురించి ఆలోచిస్తున్నా. దానిలో భాగంగానే ఈ రోజు టాక్టికల్ మూవ్ చేశాడు. ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకునేందుకు ఓ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు కేఎల్ రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాహుల్‌ ఒక కీలకమైన ఆటగాడు. ప్రస్తుత ఫామ్‌ ఆధారంగానే ఆటగాళ్లను మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసింది. అంత మాత్రాన టీ20 వరల్డ్‌కప్‌కు రాహుల్‌ను పక్కన పెట్టినట్లు కాదు. వరల్డ్‌కప్‌ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి మారొచ్చు. రాహుల్‌ సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. వన్డేల్లో కోహ్లి ఓపెనర్‌గా వస్తాడని అనుకోవడం లేదు’ అని రోహిత్‌ తెలిపాడు. ఇక్కడ చదవండి: కోహ్లి ఓపెనింగ్‌ చేస్తే నాకు అభ్యంతరమేంటి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top