దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ వికెట్ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కిషన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.
ఫెరోయిజమ్ జోతిన్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అర్పిత భటేవరాకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటికే భారత పరిమిత ఓవర్ల జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్న కిషన్.. టెస్టు జట్టులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు.
అయినప్పటికి ఈ జార్ఖండ్ ఆటగాడు తన మార్క్ చూపించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (15) త్వరగానే పెవిలియన్ బాట పట్టడంతో ఈస్ట్ జోన్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో సుదీప్ కుమార్ ఘరామీ, కుమార్ కుషాగ్రా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక కుషాగ్రా ఔటయ్యాడు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ సింగ్ (2), ఈషాన్ కిషన్ (4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. 56 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో షాబాజ్ అహ్మద్(42), ఘరామీ(130) ఉన్నారు.


