ఐపీఎల్ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ జాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ ముంబైలోని తన హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఆయన పని చేశారు.
ఆ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది స్పేర్ లాక్‌తో డోర్ ఓపెన్ చేసి చూడగా లాంగ్‌ఫోర్డ్ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
దీంతో రంగంలోకి దిగిన మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
లాంగ్‌ఫోర్డ్ కెరీర్
బ్రిటిష్ సిటిజన్ అయిన లాంగ్‌ఫోర్డ్ ఐపీఎల్ 2026లో ZOOM కమ్యూనికేషన్స్ తరఫున ఫ్రీలాన్స్ విజన్ సూపర్వైజర్‌గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్ లీగ్, 2024 పారిస్ ఒలింపిక్స్, 2010 FIFA వరల్డ్ కప్ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్స్‌లో కూడా పని చేశారు.
లాంగ్‌ఫోర్డ్‌కు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి అసైన్‌మెంట్‌గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (78), ర్యాన్ రిక్‌ల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా ముంబై ఇండయన్స్ ఘన విజయం సాధించింది.


