IPL 2026: గ్రీన్‌ గురించి కీలక అప్‌డేట్‌ | IPL 2026: KKR Green to play as pure batter for short period after minor back complaint | Sakshi
Sakshi News home page

IPL 2026: గ్రీన్‌ గురించి కీలక అప్‌డేట్‌

Mar 30 2026 4:25 PM | Updated on Mar 30 2026 4:41 PM

IPL 2026: KKR Green to play as pure batter for short period after minor back complaint

కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆస్ట్రేలియా ప్లేయర్‌ కెమరూన్‌ గ్రీన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందుతుంది. గ్రీన్‌ మరికొంతకాలం బ్యాటర్‌గా మాత్రమే కేకేఆర్‌కు అందుబాటులో ఉంటాడని అతని జాతీయ క్రికెట్‌ బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి స్పష్టం చేసింది. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ కేవలం​ బ్యాటింగ్‌ మాత్రమే చేయడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి వివరణ ఇచ్చింది.

ఈ విషయాన్ని సీఏ గతంలోనే కేకేఆర్‌ యాజమాన్యానికి తెలియజేసింది. ఇందుకు వారు కూడా సమ్మతించారు. అయితే కేకేఆర్‌ అభిమానుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో సీఏ మరోసారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. గ్రీన్‌ను కేకేఆర్‌ రూ.25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. ఇతను ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఇంత భారీ మొత్తం వెచ్చించబడిన గ్రీన్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని కేకేఆర్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో అతను బ్యాట్‌తోనూ సత్తా చాటలేకపోవడం వారి అసహనాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్‌లో గ్రీన్‌ 10 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ సాయంతో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. 

బౌలింగ్‌లో గ్రీన్‌ అందుబాటులో లేకపోవడంతో కేకేఆర్‌ ఆరుగురు బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఇది వారిని భారీ మూల్యం​ చెల్లించుకునేలా చేసింది. భారీ స్కోర్‌ (220-4) చేసినా, ఆరో స్పెషలిస్ట్‌ బౌలింగ్‌ ఆప్షన్‌ లేకపోవడంతో కేకేఆర్‌ మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోవడానికి గ్రీన్‌ పరోక్షంగా కారణమని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. 

ఇంతమాత్రం దానికి (కేవలం బ్యాటర్‌) అతని​కి 25 కోట్లు దండగ అని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గతంలో వెంకటేశ్‌ అయ్యర్‌ విషయంలోనూ ఇలానే జరిగింది. అతన్ని కూడా కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అతను కూడా గ్రీన్‌ లాగే కేవలం అడపాదడపా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమై జట్టుకు భారంగా ఉండేవాడు.

గ్రీన్‌పై వస్తున్న భారీ వ్యతిరేకత నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా అతనికి మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రీన్‌ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు వివరణ ఇచ్చింది.గ్రీన్‌ మరో 10–12 రోజుల పాటు బౌలింగ్‌ చేయడని కూడా స్పష్టం చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే బౌలింగ్‌ చేస్తాడని తెలిపింది. కాగా, 2024 చివర్లో గ్రీన్‌కు వెన్ను శస్త్రచికిత్స జరిగింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement