ఆయుశ్ మాత్రే (PC: BCCI/IPL)
వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుశ్ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్‌కే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
టోర్నీ మొత్తానికి దూరం
‘‘సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 18 నాటి మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) తొడ కండరాలు పట్టేశాయి. ఆయుశ్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్-2026లో మిగిలిన సీఎస్‌కే మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరమయ్యాడు’’ అని సీఎస్‌కే తమ ప్రకటనలో పేర్కొంది.
కాగా తాజా ఎడిషన్‌లో సీఎస్‌కే తరపున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయుశ్ మాత్రే.. ఆరు మ్యాచ్‌లు ఆడి 201 పరుగలు సాధించాడు. అత్యధిక స్కోరు 73. ముంబైకి చెందిన ఆయుశ్ మాత్రే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఇటీవలే వరల్డ్‌కప్ అందించాడు.
గతేడాది రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా సీఎస్‌కేలో చేరిన ఆయుశ్ మాత్రే ఓపెనర్‌గా రాణించాడు. ఈ ఏడాది సంజూ శాంసన్- రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రాగా.. ఆయుశ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టాడు. చివరగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు.
ఆయుశ్ స్థానంలో ఎవరు?
అయితే, ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుశ్.. ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. ఇక మంచి ఫామ్‌లో ఉన్న ఆయుశ్ సేవలను కోల్పోయిన సీఎస్‌కేకు.. అతడి బ్యాటింగ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికేమీ కాదు. ఆయుశ్ స్థానంలో ఉర్విల్ పటేల్ లేదంటే కార్తిక్ శర్మను తుదిజట్టులో ఆడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఎంఎస్ ధోని ఫిట్‌నెస్ లేక ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఖలీల్ అహ్మద్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఆయుశ్ కూడా జట్టును వీడటంతో సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి ఈ సీజన్‌లో సీఎస్‌కే.. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచింది.


