సీఎస్‌కే చెత్త రికార్డు | IPL 2026: CSK Bags worst record, did not win a single game chasing 180 plus since 2019 | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే చెత్త రికార్డు

Apr 19 2026 10:32 AM | Updated on Apr 19 2026 11:38 AM

IPL 2026: CSK Bags worst record, did not win a single game chasing 180 plus since 2019

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (59), క్లాసెన్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్‌ (3-0-22-3), జేమీ ఓవర్టన్‌ (4-0-37-3), ముకేశ్‌ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్‌ సింగ్‌ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం బరిలోకి దిగిన సీఎస్‌కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్‌ మలింగ (4-0-29-3), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4-0-31-2) సీఎస్‌కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్‌ హుస్సేన్‌ (4-0-32-1), శివాంగ్‌ కుమార్‌ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు. 

వీరి ధాటికి సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌ ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌.

హ్యాట్రిక్‌ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్‌కే మూటగట్టుకున్న మరో ఓటమి ఇది. ఈ ఓటమితో సీఎస్‌కే పలు చెత్త రికార్డులను సొంతం చేసుకుంది.

2019 తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా 180 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదించలేదు. 14 ప్రయత్నాల్లో ఓటమినే చవిచూసింది. సీఎస్‌కే చివరిసారిగా 180 ప్లస్‌ టార్గెట్‌ను 2018 సీజన్‌లో ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌పై ఛేదించింది.

ఇది కాక సీఎస్‌కే మరో చెత్త రికార్డును కూడా కొనసాగించింది. నిన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ జరిగిన వేదికపై (హైదరాబాద్‌లో ఉప్పల్‌ స్టేడియం) సీఎస్‌కే ఎనిమిదేళ్లుగా ఒక్క గెలుపూ నమోదు చేయలేదు. ఈ వేదికపై  సీఎస్‌కేకు అతి చెత్త రికార్డు ఉంది. కాగా, నిన్నటి పరాజయం తర్వాత సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది.

 

Advertisement
 
Advertisement
Advertisement