
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్‌లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
బ్రార్ వేసిన ఆఖరి ఓవర్‌లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు.