#Umran Malik: గత సీజన్‌లో చేసిన తప్పులే మళ్లీ చేశాడు! అలాంటి మాటలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి..

IPL 2023: Umran Malik Made Same Mistakes As Last Year: Sehwag - Sakshi

IPL 2023- SRH- Umran Malik: ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పెదవి విరిచాడు. గత సీజన్‌లో చేసిన తప్పులనే ఈసారి కూడా పునరావృతం చేశాడని విమర్శించాడు. డేల్‌ స్టెయిన్‌ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ మార్గదర్శనం చేసేందుకు అందుబాటులో ఉన్నప్పటికీ ఉమ్రాన్‌ ఏం నేర్చుకున్నాడో అర్థం కావడం లేదని వాపోయాడు.

అంచనాలు అందుకోలేక
కాగా నెట్‌ బౌలర్‌గా సన్‌రైజర్స్‌లో ఎంట్రీ ఇచ్చిన కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌.. అద్భుత ప్రదర్శనతో జట్టులో ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. గత సీజన్‌లో 22 వికెట్లు తీసిన అతడు.. భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. అయితే, ఐపీఎల్‌ పదహారో ఎడిషన్‌ మాత్రం ఉమ్రాన్‌కు అస్సలు కలిసి రాలేదు.

కెప్టెన్‌కే తెలియదట
అంచనాలకు అనుగుణంగా రాణించలేక చతికిలపడ్డ ఉమ్రాన్‌.. తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. సీజన్‌ మొత్తంలో 8 మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్‌ ఏకంగా 217 పరుగులు సమర్పించుకుని(ఎకానమీ 10.85) కేవలం ఐదు వికెట్లు తీశాడు. ఇక పలు కీలక మ్యాచ్‌లలో ఉమ్రాన్‌ను తప్పించడంపై తనకు కూడా అవగాహన లేదంటూ రైజర్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ వ్యాఖ్యానించడం సందేహాలకు తావిచ్చింది.

మళ్లీ మళ్లీ అవే తప్పులు
ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో కచ్చితత్వం లేకుండా పోయింది. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌల్‌ చేయలేకపోతున్నాడు. ఇప్పటికీ తను యువకుడే. 

బౌలర్‌గా పూర్తి స్థాయి అనుభవం లేదు. డేల్‌ స్టెయిన్‌తో కలిసి పని చేశాడు. అయినా, అతడి ఆట తీరులో మార్పు రాలేదు. స్టెయిన్‌ దగ్గర అతడు చాలా నేర్చుకోవచ్చు. కానీ అలా ఏమీ కనిపించడం లేదు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ విషయంలో గత సీజన్‌లో మాదిరే ఈసారి కూడా కొన్ని తప్పులు చేశాడు’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

ఇక​ ఉమ్రాన్‌కు ఛాన్స్‌లు తక్కువగా ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ఈసారి ఉమ్రాన్‌కు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఏకంగా కెప్టెన్‌కే తన సెలక్షన్‌ గురించి అవగాహన లేదంటే జట్టులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు కచ్చితంగా ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

ఏదేమైనా ఉమ్రాన్‌ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది’’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈసారి కూడా సన్‌రైజర్స్‌ దారుణ ప్రదర్శన కారణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. 

చదవండి: IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్‌’కు ముందెవరు?
IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌, వివరాలు ఇవే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top