IPL 2023: సన్‌రైజర్స్‌పై లక్నో ఘన విజయం

IPL 2023 SRH VS LSG Match Updates And Highlights - Sakshi

సన్‌రైజర్స్‌పై లక్నో ఘన విజయం
ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపే ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్‌ అభిషేక్‌ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు.

ఆ ఓవర్‌లో అభిషేక్‌ 31 పరుగులు (స్టోయినిస్‌ 2 సిక్సర్లు, పూరన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్‌ (13 బంతుల్లో 4 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్‌ మన్కడ్‌ (45 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్‌ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం   తన వంతు పాత్ర పోషించాడు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36), రాహుల్‌ త్రిపాఠి (20), మార్క్రమ్‌ (28), క్లాసెన్‌ (47), అబ్దుల్‌ సమత్‌ (37 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (0), అభిషేక్‌ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ 2, యుద్ద్‌వీర్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో
అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన అనంతరం స్టోయినిస్‌ (40) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో.. డికాక్‌ ఔట్‌
మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో  అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి డికాక్‌ (29) ఔటయ్యాడు. 8.2 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 54/2. ప్రేరక్‌ మన్కడ్‌ (21) క్రీజ్‌లో ఉన్నాడు.

టార్గెట్‌ 183.. ఆచితూచి ఆడుతున్న లక్నో ప్లేయర్లు
183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో ఓవర్‌లోనే కైల్‌ మేయర్స్‌ (14 బంతుల్లో 2) వికెట్‌ పోగొట్టుకున్న లక్నో.. మరో వికెట్‌ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 50/1గా ఉంది. డికాక్‌ (25), ప్రేరక్‌ మన్కడ్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు.

లక్నోతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ స్కోర్‌ ఎంతంటే..?
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36), రాహుల్‌ త్రిపాఠి (20), మార్క్రమ్‌ (28), క్లాసెన్‌ (47), అబ్దుల్‌ సమత్‌ (37 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (0), అభిషేక్‌ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ 2, యుద్ద్‌వీర్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి క్లాసెన్‌ (29 బంతుల్లో 47) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 173/6. అబ్దుల్‌ సమద్‌ (30), భువనేశ్వర్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌
సన్‌రైజర్స్‌ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. కృనాల్‌ వేసిన 13వ ఓవర్‌ తొలి రెండు బంతులకు మార్క్రమ్‌, ఫిలిప్స్‌ ఔటయ్యారు. 13 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 117/5.

నాలుగో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
కృనాల్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌ (28) స్టంపౌటయ్యాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
82 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36)ను అమిత్‌ మిశ్రా కాట్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. 11 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌  101/3. మార్క్రమ్‌ (27), క్లాసెన్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
ధాటిగా ఆడుతున్న రాహుల్‌ త్రిపాఠి (13 బంతుల్లో 20; 4 ఫోర్లు) యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 56/2. మార్క్రమ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతికి వికెట్‌ కోల్పోయింది. యద్ధ్‌వీర్‌ సింగ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (7) ఔటయ్యాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌
ఐపీఎల్‌ 2023లో భాగంగా రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (మే 13) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. 

తుది జట్లు:

సన్‌రైజర్స్‌: ఎయిడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్స్‌, అబ్దుల్‌ సమద్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, మయాంక్‌ మార్కండే, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి నటరాజన్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌: క్వింటన్‌ డికాక్‌, కృనాల్‌ పాండ్యా, కైల్‌ మేయర్స్‌, ప్రేరక్‌ మన్కడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌, యశ్‌ ఠాకూర్‌, యుద్ధ్‌వీర్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top