Ipl Retention: రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. జడేజాకు భారీ ధర.. పూర్తి వివరాలు!

IPL 2022 retained players full list ahead of auction - Sakshi

కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు... మొత్తంగా చూస్తే అంచనాలకు అనుగుణంగానే ఐపీఎల్‌ ‘రిటెన్షన్‌’ సాగింది... సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. సన్‌రైజర్స్‌తో రషీద్‌ ఖాన్‌ బంధం ముగియగా, ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యాను వదిలేసింది. డుప్లెసిస్‌కంటే మొయిన్‌ అలీ వైపే చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొగ్గు చూపగా, పొలార్డ్‌లో ఇంకా పవర్‌ మిగిలి ఉందని ముంబై నమ్మింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా గిల్‌లాంటి కుర్రాడిని కాదని రసెల్‌లాంటి వెటరన్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. 2022 రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తున్న నేపథ్యంలో ఈ కొనసాగింపు ఆసక్తి రేపింది. ఇక కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో ఎంచుకునే తర్వాతి ఆరుగురు ఎవరనేది చూడాలి.

ఐపీఎల్‌ జట్లు తమతో అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (ప్రాధాన్యత క్రమంలో)
చెన్నై సూపర్‌ కింగ్స్‌
1. జడేజా (రూ. 16 కోట్లు) 
2. ధోని (రూ. 12 కోట్లు) 
3. మొయిన్‌ అలీ (రూ. 8 కోట్లు)  
4. రుతురాజ్‌ గైక్వాడ్‌ (రూ. 6 కోట్లు) 
విశేషాలు: ధోని కాకుండా జడేజాకు తొలి ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన అలీను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాగా, రుతురాజ్‌కు మరో మంచి అవకాశం దక్కింది.

బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ 
1. కోహ్లి (రూ.15 కోట్లు) 
2. మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు) 
3. సిరాజ్‌ (రూ. 7 కోట్లు) 
విశేషాలు: హర్షల్‌తో పోటీ ఉన్నా టీమిండియాలో రెగ్యులర్‌ పేసర్‌గా మారిన సిరాజ్‌ వైపు జట్టు మొగ్గు చూపింది. నాలుగో ఆటగాడిగా చహల్‌ను తీసుకునే అవకాశం ఉన్నా ఆసక్తి చూపించలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ 
1. రిషభ్‌ పంత్‌ (రూ. 16 కోట్లు) 
2. అక్షర్‌ పటేల్‌ (రూ. 9 కోట్లు)  
3. పృథ్వీ షా (రూ. 7.50 కోట్లు)  
4. నోర్జే (రూ. 6.50 కోట్లు) 
విశేషాలు: దాదాపుగా ఊహించినట్లే ఉంది. సీనియర్లు అశ్విన్, ధావన్‌లను వద్దనుకుంది. నిలకడగా ఆడుతున్న నోర్జేకు అవకాశం దక్కగా, శ్రేయస్‌ తనే స్వయంగా తప్పుకున్నాడు.

పంజాబ్‌ కింగ్స్‌ 
1. మయాంక్‌ అగర్వాల్‌ (రూ. 12 కోట్లు)  
2. అర్‌‡్షదీప్‌ సింగ్‌ 
(అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)  
విశేషాలు: జట్టుతో కొనసాగడానికి కేఎల్‌ రాహుల్‌ ఇష్టపడలేదు. ఇటీవల డిమాండ్‌ పెరిగిన తమిళనాడు ప్లేయర్‌ షారుఖ్‌ ఖాన్‌ కూడా వేలంలో వెళ్లేందుకు ఆసక్తి చూపించి ఉండవచ్చు. అయితే వేలంలో ఇంత భారీ విలువ దక్కే అవకాశం లేని మయాంక్‌ను రూ. 12 కోట్లకు తీసుకోవడం అతనికి లభించిన జాక్‌పాట్‌. గత సీజన్‌లో ఆకట్టుకున్న అర్‌‡్షదీప్‌ను స్థానిక ఆటగాడిగా కొనసాగించారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 
1. ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు) 
2. వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు) 
3. వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు)  
4. సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)  
విశేషాలు: చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చి చాలా కాలమైనా రసెల్‌పై ఫ్రాంచైజీ నమ్మకముంచింది. నరైన్‌పై ఇన్నేళ్ల తర్వాత కూడా ఆశలు పెట్టుకోగా... మిగిలిన రెండు ఊహించినవే. మున్ముందు కెప్టెన్‌ కాగలడని భావించిన శుబ్‌మన్‌ గిల్‌ను వదిలేసుకుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
1. కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు)  
2. అబ్దుల్‌ సమద్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు) 
3. ఉమ్రాన్‌ మలిక్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు) 
విశేషాలు: విలియమ్సన్‌ను ఇంత భారీ మొత్తంతో కొనసాగించడం పెద్ద విశేషం. ఫ్రాంచైజీతో విభేదాలతో వార్నర్‌ మళ్లీ రాడనే ముందే తెలిసిపోగా... రషీద్‌ తనకు ఇవ్వచూపిన మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేసి వేలానికి సిద్ధపడ్డాడు. జోరు తగ్గిన భువనేశ్వర్‌ను వద్దనుకున్న ఫ్రాంచైజీ... మంచి విజయాలందించిన బెయిర్‌స్టోనూ పట్టించుకోలేదు.

ముంబై ఇండియన్స్‌ 
1. రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు) 
2. బుమ్రా (రూ. 12 కోట్లు)  
3. సూర్యకుమార్‌ (రూ. 8 కోట్లు) 
4. పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)  
విశేషాలు: ఇటీవలి ఫామ్, ఫిట్‌నెస్‌ చూస్తే హార్దిక్‌ను తప్పించడం ఊహించిందే. అయితే విధ్వంసక ఆట, కీపింగ్‌తో పాటు రాబోయే సీజన్లలోనూ ప్రభావం చూపగల ఇషాన్‌ను తీసుకోకపోవడం అనూహ్యం. 35 ఏళ్ల పొలార్డ్‌కు మరో అవకాశం ఇవ్వడం కూడా సరైన నిర్ణయంగా అనిపించలేదు.

రాజస్తాన్‌ రాయల్స్‌ 
1. సంజు సామ్సన్‌ 
(రూ. 14 కోట్లు) 
2. జాస్‌ బట్లర్‌ 
(రూ. 10 కోట్లు) 
3. యశస్వి జైస్వాల్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు) 
విశేషాలు: కెప్టెన్‌గా ఆకట్టుకున్న సామ్సన్, దూకుడైన బట్లర్‌లను కొనసాగించడం సరైందే. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు ఇది మంచి అవకాశం. ఫిట్‌నెస్‌ ఇబ్బందులు ఉన్న ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్లు బెన్‌ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌లపై సహజంగానే భారీ మొత్తం పెట్టేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ ఆసక్తి చూపించలేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top