బాధిస్తోంది.. మాకు కూడా అదే జరిగింది: వార్నర్‌

IPL 2021: We Played Cross Batted Shots, David Warner - Sakshi

చెన్నై:  ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల  టార్గెట్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్‌ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్‌ తిరిగి తేరుకోలేకపోయింది. ఓ దశలో రషీద్‌ ఖాన్‌(17) గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్నా రనౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్‌ పరాజయం చెందింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు గెలుపును అందించారు. ఇక ఆర్సీబీ ఓటమి ఖాయం అనుకున్న స్థితి నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చారు.  షెహబాజ్‌ అహ్మద్‌ ఒకే ​ఓవర్‌లో మూడు వికెట్లు సాధించి సన్‌రైజర్స్‌ పతనాన్ని శాసించాడు. బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, అబ్దుల్‌ సామద్‌ వికెట్లు సాధించి గేమ్‌ ఛేంజర్‌గా మారాడు.

సన్‌రైజర్స్‌ ఓటమి తర్వాత అవార్డుల కార్యక్రమంలో వార్నర్‌ మాట్లాడుతూ.. ఓటమికి తాను కూడా కారణమన్నాడు. ‘ నేను కడవరకూ క్రీజ్‌లో ఉండాలనుకున్నా. కానీ అది జరగలేదు. నేను ఔటైన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. మనీష్‌ పాండే-నేను కడవరకూ క్రీజ్‌లో ఉంటే మ్యాచ్‌ గెలిచేవాళ్లం. కానీ మేము అలా చేయడంలో విఫలమయ్యాం. కచ్చితమైన షాట్లు ఉండాలి.. అదే సమయంలో భాగస్వామ్యాలు నమోదు చేయడం కూడా ఎంతో అవసరం. ఈరోజు మేము పూర్తిగా వైఫల్యం చెందాం. ముఖ్యం‍గా బ్యాటింగ్‌లో వైఫల్యం కారణంగానే ఈ పరాజయంం. బౌలర్లు అంతా కూడా బాగా బౌలింగ్‌ చేశారు.. ఆర్సీబీని మేము అనుకున్న స్కోరుకే కట్టడి చేశారు. మ్యాక్స్‌వెల్‌ ఆర్సీబీకి ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేశాడు. 

మా బ్యాటర్స్‌ భాగస్వామ్యాలు సాధించడంలో విఫలమయ్యారు. క్రాస్‌ బ్యాటెడ్‌ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాం. ఇది బాధిస్తోంది. మనీష్‌-నేను క్రీజ్‌లో సెట్‌ అయిన బ్యాట్యమెన్‌.  మేమే ముగించాలనుకున్నాం... కానీ ఆర్సీబీ పిచ్‌ నుంచి లభించిన సహకారంతో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. ఇక్కడ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ఎలా ముందుకెళ్లాలనేది మాకు తెలుసు. చెపాక్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలవాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా వరుస మూడు మ్యాచ్‌ల ఫలితాలు వచ్చాయి. అంతకుముందు రాత్రి ఏమి జరిగిందో(ముంబై-కేకేఆర్‌ల మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ) అది మళ్లీ జరిగింది‘ అని వార్నర్‌ తెలిపాడు.

ఇక్కడ చదవండి: ఏడేళ్ల తర్వాత రోహిత్‌.. ఇది వ్యూహం కాదంటారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top