నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్‌, జడ్డూలను తీసుకుంటా.. | IPl 2021: If I was Kohli I Would Pick Ashwin And Jadeja Ahead Of Chahal And Kuldeep For Upcoming T20 WorldCup | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 12 2021 7:59 PM | Updated on Apr 12 2021 8:18 PM

IPl 2021: If I was Kohli I Would Pick Ashwin And Jadeja Ahead Of Chahal And Kuldeep For Upcoming T20 WorldCup  - Sakshi

లండన్: ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినైతే టీ20 ప్రపంచకప్ జట్టులోకి చహల్, కుల్దీప్ యాదవ్‌లను అస్సలు తీసుకోనని, వారి స్థానాల్లో సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లకు అవకాశం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై చహల్-కుల్దీప్‌ల కంటే అనుభవజ్ఞులైన జడేజా-అశ్విన్‌లవైపు మొగ్గుచూపడమే భారత్‌కు మంచిదని, ఈ ఇద్దరు స్పిన్నర్లు ఆల్‌రౌండర్లనే విషయం మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ప్రస్తుత భారత్‌ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్నర్ల విభాగమే కాస్త కలవరపెడుతోందని ఆయన తెలిపాడు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్, చహల్ కొనసాగుతున్నారని, ఈ ఫార్మట్‌లో వీరి ప్రదర్శన అంత మెరుగ్గా లేకపోవడం వల్లనే తాను ఈ తరహా వ్యాఖ్యలు చేశానని పనేసర్‌ వెల్లడించాడు. గత 10 మ్యాచ్‌ల్లో చహల్‌ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగా, కుల్దీప్ ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయాడన్నాడు.

ఈ నేపథ్యంలోనే అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఆయన సూచించాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ చహల్, కుల్దీప్‌కు అగ్ని పరీక్షలాంటిదని, ఇందులో విఫలమైతే వారి టీ20 ప్రపంచకప్ బెర్త్‌లపై సందిగ్ధత నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేకపోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement