ముంబై మెరుపులు

IPL 2020: Mumbai Indians Won Against Kings XI Punjab - Sakshi

రోహిత్‌ శర్మ అర్ధసెంచరీ  

చెలరేగిన పొలార్డ్, హార్దిక్‌ 

పంజాబ్‌పై జయభేరి 

ముంబై ఇండియన్స్‌ గర్జించింది. మెరుపులు ఆలస్యమైనా... ఆఖర్లో అనూహ్య విధ్వంసంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిన్నాభిన్నం చేసింది. సింహభాగం ఓవర్ల దాకా ఆధిపత్యం చలాయించిన కింగ్స్‌ బౌలింగ్‌ చివరకొచ్చేసరికి చేతులెత్తేసింది. రోహిత్, పొలార్డ్, పాండ్యా చూపించిన చుక్కలకు, కొట్టిన బౌండరీలకు స్కోరు బోర్డు వాయు వేగంతో దూసుకెళ్లింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో కింగ్స్‌పై పంజా విసరడంతో విజయం సులువుగానే దక్కింది.   

అబుదాబి: ముంబై ఆల్‌రౌండ్‌ సత్తాకు పంజాబ్‌ దాసోహమైంది. డెత్‌ ఓవర్లో అయితే బ్యాటింగ్‌ విశ్వరూపానికి ప్రత్యక్ష సాక్ష్యమైంది. తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు చేతులెత్తేసింది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 48 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా... పొలార్డ్‌ (20 బంతుల్లో 47 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు.  

డికాక్‌ డకౌట్‌ 
ముంబై ఇండియన్స్‌ పరుగు ప్రారంభించక ముందే డికాక్‌ డకౌటైతే... రెండో ఓవర్లో రోహిత్‌ ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. షమీ తొలి బంతిని బౌండరీకి తరలించడంతో హిట్‌మ్యాన్‌ ఈ మార్క్‌ చేరాడు. కానీ ముంబై స్కోరు మాత్రం జోరుగా సాగలేదు. పది ఓవర్లు గడిచినా... రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నా ఒక్క సిక్సరైనా లేదు. అడపాదడపా ఫోర్ల రూపంలో పరుగులొచ్చినా మ్యాచ్‌ చప్పగా సాగింది. ఈ దశలో ఇషాన్‌ కిషన్‌  (32 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) భారీ సిక్సర్‌తో మురిపించాడు. కానీ పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు అతని ఆటలు ఎంతోసేపు సాగలేదు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్లకు 87 పరుగులే చేయగలిగింది.  

పూరన్‌ ఒక్కడే... 
పంజాబ్‌ ఆరంభం అదిరింది. తొలి ఓవర్లోనే మయాంక్, రాహుల్‌ చెరో బౌండరీ బాదారు. రెండో ఓవర్లో 12, మూడో ఓవర్లో 9 పరుగుల రావడంతో కింగ్స్‌ 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. అయితే మయాంక్‌ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు) జోరుకు బుమ్రా కళ్లెం వేశాడు. కాసేపటికే కరుణ్‌ నాయర్‌ (0), రాహుల్‌ (17) అవుట్‌ కావడంతో పంజాబ్‌ గెలుపు దారి మూసుకుపోయింది. ఈ దశలో నికోలస్‌ పూరన్‌ ధాటిగా ఆడాడు. సిక్స్‌లు, ఫోర్లతో జోరందుకున్నాడు. కానీ చేయాల్సిన రన్‌రేట్‌కు అతనొక్కడి ధనాధన్‌ ఏమాత్రం సరిపోలేదు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. అయితే ఆ మరుసటి బంతికే పూరన్‌ ఔట్‌ కావడం, హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ (11) చేతులెత్తేయడంతో పంజాబ్‌ ఓటమి 15వ ఓవర్లోనే ఖాయమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కృష్ణప్ప గౌతమ్‌ (13 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆట 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు పనికొచ్చింది.   

సచిన్‌ మాట! 
ముంబై 18వ ఓవర్లో 18 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 19 పరుగులు చేసింది. హిట్టర్లు పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా క్రీజులో విధ్వంసరచన చేస్తుంటే పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ 20వ ఓవర్‌ వేసేందుకు ఆఫ్‌ స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌కు బంతినిచ్చాడు. ఈ పరిణామం బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ను సైతం విస్మయపరిచింది. అందుకేనేమో ట్విట్టర్‌లో ఆ దిగ్గజం తలబాదుకునే ఇమోజీతో వ్యాఖ్య జోడించి పోస్ట్‌ చేశాడు. ‘పొలార్డ్, పాండ్యా క్రీజ్‌లో ఉన్నప్పుడు 20వ ఓవర్‌ ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ బౌల్‌ చేయడమా’ అని అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే రాహుల్‌ వ్యూహం ఎంత తప్పో అర్థమవుతుంది.   

ఆరు... ఫోరు... ఆఖర్లో ముంబై జోరు..
ముంబై 14 ఓవర్లు ఆడింది. ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ క్రీజులో ఉన్నాడు. అయినా జట్టు స్కోరు వంద పరుగులైనా చేయలేదు. మిగిలినవి 6 ఓవర్లు. పిచ్‌ స్వభావం, మ్యాచ్‌ జరిగిన విధానం బట్టి... కాస్త ధాటిగా ఆడినా ఈ 36 బంతుల్లో 60, 70 పరుగులు చేస్తుందిలే అనుకున్నారంతా! కానీ ఈ ఆరు ఓవర్లే ముంబై దశను మార్చాయి. ఈ సమయంలో ఫోర్లు, సిక్సర్లు పోటీపడ్డాయి. బౌండరీ లైనును అదే పనిగా దాటాయి. బిష్ణోయ్‌ 15వ ఓవర్లో రోహిత్‌ రెండు సిక్సర్లతో స్కోరు వంద దాటింది. నీషమ్‌ 16 ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 6 బాదడంతో అర్ధసెంచరీ దాటి ఏకంగా 70 పరుగులకు చేరింది. అదే స్కోరుపై రోహిత్‌ను మరుసటి ఓవర్‌ తొలి బంతికే షమీ ఔట్‌ చేయగా... 17వ ఓవర్లో ఐదే పరుగులొచ్చాయి. 18, 19, 20 ఓవర్లలలో హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌ల ధనాధన్‌తో దద్దరిల్లింది. ఈ 18 బంతుల్లో బంతి ఏకంగా 11 సార్లు బౌండరీని దాటింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై 104 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేవలం 23 బంతుల్లోనే పొలార్డ్, పాండ్యా అబేధ్యమైన ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు.  

3 ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని దాటిన మూడో బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (5430), సురేశ్‌ రైనా (5368)లు రోహిత్‌ శర్మ (5068)కంటే ముందున్నారు.   

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) కాట్రెల్‌ 0; రోహిత్‌ (సి) నీషమ్‌ (బి) షమీ 70; సూర్య కుమార్‌ (రనౌట్‌) 10; ఇషాన్‌ కిషన్‌ (సి) కరుణ్‌ నాయర్‌ (బి) గౌతమ్‌ 28; పొలార్డ్‌ (నాటౌట్‌) 47; హార్దిక్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 191
వికెట్ల పతనం: 1–0, 2–21, 3–83, 4–124.  
బౌలింగ్‌: కాట్రెల్‌ 4–1–20–1, షమీ 4–0–36–1, రవి 4–0–37–0, గౌతమ్‌ 4–0–45–1, నీషమ్‌ 4–0–52–0.  

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) చహర్‌ 17; మయాంక్‌ (బి) బుమ్రా 25; కరుణ్‌ నాయర్‌ (బి) కృనాల్‌ 0; పూరన్‌ (సి) డికాక్‌ (బి) ప్యాటిన్సన్‌ 44; మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) చహర్‌ 11; నీషమ్‌ (సి) సూర్య కుమార్‌ (బి) బుమ్రా 7; సర్ఫరాజ్‌ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్‌ 7; గౌతమ్‌ (నాటౌట్‌) 22; రవి (సి) సూర్య కుమార్‌ (బి) బౌల్ట్‌ 1; షమీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. 
వికెట్ల పతనం: 1–38, 2–39, 3–60, 4–101, 5–107, 6–112, 7–121, 8–124. 
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–42–1, ప్యాటిన్సన్‌ 4–0–28–2, కృనాల్‌ 4–0–27–1, బుమ్రా 4–0–18–2, చహర్‌ 4–0–26–2.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top