నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు
ఇరు జట్లలోనూ మేటి స్పిన్నర్లు
అదనపు బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా
ఉదయం గం. 9:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
కోల్‌కతా: సొంతగడ్డపై బెబ్బులి అయిన టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా సవాల్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. ఇరుజట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్‌పై ఈ సంప్రదాయ క్రికెట్ సమరం ఆసక్తికరంగా జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు.
ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను సమం చేసుకున్న భారత్ అదే ఉత్సాహంతో సొంతగడ్డపై సఫారీని ఓడించాలనే లక్ష్యంతో ఉంది. బ్యాటింగ్ బలగం, స్పిన్, పేస్‌ల కలబోతతో పాటు అనుకూలించే ఆతిథ్య వేదిక టీమిండియాను పైచేయిగా నిలుపుతోంది.
టీమిండియాకు పరీక్షే!
ఆతిథ్య అనుకూలతలెన్ని ఉన్నా కూడా న్యూజిలాండ్‌తో భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ అయ్యింది. కాబట్టి ఈసారి ఆదమరిస్తే అంతేసంగతి. తొలి రోజు తొలి సెషన్ నుంచే భారత ఆటగాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకొని శ్రమిస్తేనే అనుకూలతలో సానుకూల ఫలితాల్ని ఆశించవచ్చు. బ్యాటింగ్ లైనప్ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది.
ఏకంగా ఎనిమిది, తొమ్మిది మంది బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. జైస్వాల్, రాహుల్, సాయిసుదర్శన్‌లతో టాపార్డర్, కెప్టెన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్‌లతో కూడిన మిడిలార్డర్, జడేజా, సుందర్, అక్షర్‌లతో లోయర్ ఆర్డర్ కూడా పరుగులు రాబట్టగలదు. ఇంగ్లండ్ సిరీస్‌లో సుందర్, జడేజాల భాగస్వామ్యం, టెస్టును ‘డ్రా’ చేసిన వైనం ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోరు.
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన రిషభ్ పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధం కాగా, ధ్రువ్ జురేల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టే టీమ్ మేనేజ్‌మెంట్ ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను పక్కనబెట్టి మరీ ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్లకు అవకాశమిచ్చింది.
సఫారీ తక్కువేం కాదు...
దక్షిణాఫ్రికా గట్టి ప్రత్యర్థి. గతంలో భారత పర్యటనలకు వచ్చినపుడు కంగుతిన్న సఫారీ జట్లకి... ప్రస్తుత బవుమా బృందానికి తేడా ఉంది. భారత్‌లాగే దక్షిణాఫ్రికా ఆయుధం కూడా స్పిన్నే! అనుభవజు్ఞడైన కేశవ్ మహరాజ్‌తో పాటు సైమన్ హార్మర్, సెనురాన్ ముత్తుసామి ఈ పర్యటనలో తప్పకుండా ఆతిథ్య బౌలర్లకు దీటుగా ప్రభావం చూపించగలరు. అచ్చూ భారత్‌లాగే సఫారీ బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది.
మార్క్‌రమ్–రికెల్టన్ ఓపెనింగ్ జోడీ నుంచి ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే మార్కో యాన్సెన్ వరకు పరుగులు సాధిస్తారు. ట్రిస్టన్ స్టబ్స్, డి జార్జి, సారథి బవుమా, వికెట్ కీపర్ కైల్ వెరీన్‌లు స్పిన్, పేస్‌ను ఎంచక్కా ఎదుర్కోగలరు. పైగా ఇక్కడికి వచ్చే ముందు పాక్‌లో పర్యటించిన దక్షిణాఫ్రికా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ (వన్డే, టి20)లు ఓడిందేమో కానీ టెస్టు సిరీస్‌ను మాత్రం కోల్పోలేదు. 1–1తో సమం చేసుకొని భారత ఉపఖండంపై సత్తాచాటేందుకు ‘సై’ అంటోంది.
పిచ్, వాతావరణం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ తొలిరోజు బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌పై ఉన్న పచ్చికతో పేస్ బౌలర్లు కూడాఆరంభంలో ప్రభావం చూపొచ్చు. ఆఖరి సెషన్ లేదంటే మూడో రోజు నుంచి స్పిన్‌కు టర్న్ అవుతుంది. టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా బ్యాటింగే ఎంచుకుంటుంది. వర్షం ముప్పు లేదు.
16 భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 44 టెస్టులు జరిగాయి. 16 టెస్టుల్లో భారత్, 18 టెస్టుల్లో దక్షిణాఫ్రికా గెలిచాయి. 10 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ 19 టెస్టులు ఆడింది. 11 టెస్టుల్లో నెగ్గి, ఐదింటిలో ఓడింది. మూడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
13 ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 42 టెస్టులు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 20 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టెస్టులు జరిగాయి. రెండింటిలో భారత్, ఒక దాంట్లో దక్షిణాఫ్రికా గెలుపొందాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సాయిసుదర్శన్, పంత్, జురేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్ ), మార్క్‌రమ్, రికెల్టన్, స్టబ్స్, టోని డి జోర్జి, కైల్ వెరీన్, సెనురాన్ ముత్తుసామి, హార్మర్, యాన్సెన్, కేశవ్, రబడ.


