India vs England 3rd Test: ‘మహా’ సమరానికి సై

India vs England 3rd Test: Pink Ball Test Starts Feb 24th At Motera Stadium - Sakshi

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టు

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌

మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

సబర్మతి తీరాన బుధవారం భారత క్రికెట్‌ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. కళ్లు చెదిరే భారీతనం... అలా చూస్తూ ఉండిపోయే నిర్మాణ చాతుర్యం, కొత్తగా కనిపించే ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు... వీటికి తోడు గులాబీ బంతి... సుమారు 55 వేల మంది ప్రేక్షకులతో మొటెరా మైదానంలో మోత మోగనుంది. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యే క్షణం భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్‌ వేదికపై ఒక హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్‌ సమంగా నిలిచిన ప్రస్తుత స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరువవుతుంది. 

అహ్మదాబాద్‌: సిరీస్‌లోని మూడో టెస్టులోనే ఇంగ్లండ్‌కు ఎంతో కొంత విజయావకాశాలు ఉన్నాయి. ఆ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో చాలా మంది విశ్లేషకులు, మాజీల అభిప్రాయమిది. డే అండ్‌ నైట్‌ టెస్టు కావడం, గులాబీ బంతితో స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటమే అందుకు కారణం. అయితే చెన్నైలో తొలి టెస్టు ఫలితం వారికి అనుకూలం రాగా, రెండో టెస్టులో భారత్‌ దెబ్బ కొట్టింది. గత మ్యాచ్‌ తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం రెట్టింపవ్వగా, ఇంగ్లండ్‌ కొంత ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేటి నుంచి జరిగే మూడో టెస్టులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. భారత గడ్డపై ఇది రెండో డే అండ్‌ నైట్‌ టెస్టు కాగా, ఓవరాల్‌గా టీమిండియాకు మూడోది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం అధికారికంగా స్టేడియంను ప్రారంభిస్తారు.  

బరిలోకి బుమ్రా... 
రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో సిరాజ్‌కు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు బుమ్రా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. చెన్నైలో రెండో టెస్టు ముగిసిన రోజే పింక్‌ బాల్‌తో బుమ్రా తన సాధన మొదలు పెట్టడం విశేషం. అయితే తుది జట్టులో మరో మార్పుకు కూడా అవకాశం కనిపిస్తోంది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కన పెట్టడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో మూడో పేసర్‌గా ఉమేశ్‌ యాదవ్‌ ఆడవచ్చు. భారత్‌లో మంచి రికార్డు ఉండటంతో పాటు రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగల నైపుణ్యం అతని సొంతం. ఒకవేళ పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుందని భావించినా ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, అక్షర్‌ పటేల్‌ జట్టులో ఉండగా గత మ్యాచ్‌ తరహాలోనే (12.2 ఓవర్లు) ఈసారి కూడా కుల్దీప్‌కు పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం రాకపోవచ్చు కాబట్టి అతడిని తప్పించినట్లే.

అయితే ఉమేశ్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు సొంత మైదానంలో టెస్టు ఆడే అవకాశం కల్పించడంపై కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. మూడో పేసర్‌గా కొన్ని ఓవర్లు వేయడంతో పాటు అతని దూకుడైన బ్యాటింగ్‌ జట్టుకు ఉపయోగపడగలదు. బ్యాటింగ్‌పరంగా భారత్‌ టాప్‌–6తో పటిష్టంగా ఉంది. తన స్థాయి ఏమిటో రోహిత్‌ శర్మ గత టెస్టులో చూపించగా, కోహ్లి కూడా నిలకడగా ఆడుతున్నాడు. రహానే ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... పాత స్టేడియం కూలగొట్టడానికి ముందు ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టులో ‘డబుల్‌ సెంచరీ’ చేసిన పుజారా మళ్లీ చెలరేగేందుకు సన్నద్ధమయ్యాడు. ఇక అశ్విన్‌ తమ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ ప్రత్యర్థి పని పట్టడం ఖాయం.  


బెయిర్‌స్టో, రూట్‌ 

బెయిర్‌స్టోకు చాన్స్‌...
అనూహ్యంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌ రెండో టెస్టులో కుప్పకూలింది. ఇప్పుడు మళ్లీ కోలుకునేందుకు ఆ జట్టుకు ఇది మంచి అవకాశం. లైట్ల వెలుగులో పింక్‌ బంతి ఏమాత్రం స్వింగ్‌ అయినా దానిని సమర్థంగా ఉపయోగించుకోవడంలో అండర్సన్‌ను మించినవాళ్లు లేరు. అతనికి మరోవైపు నుంచి ఫాస్ట్‌ బౌలర్‌ ఆర్చర్‌ నుంచి కూడా సహకారం లభిస్తే వీరిని ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. ఇదే కారణంగా ఒకే ఒక స్పిన్నర్‌ (లీచ్‌)ను ఆడించి మరో స్వింగ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు జట్టు పరిశీలనలో ఉన్నాయి.

అయితే పిచ్‌ స్పిన్‌కు బాగుందని భావిస్తే మాత్రం డామ్‌ బెస్‌ జట్టులోకి వస్తాడు. మొయిన్‌ అలీ స్వదేశం వెళ్లిపోవడంతో బెస్‌కు మరో అవకాశం దక్కనుంది. బ్యాటింగ్‌లో మరోసారి కెప్టెన్‌ జో రూట్‌పైనే భారం ఉండగా, స్టోక్స్‌ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌ మరో రెండు మార్పులు కూడా చేసింది. బర్న్స్, లారెన్స్‌ స్థానాల్లో క్రాలీ, బెయిర్‌స్టో బరిలోకి దిగుతారు. గత మ్యాచ్‌ అనుభవం నేపథ్యంలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఈసారి మరింత పట్టుదల కనబర్చి భారీ స్కోరు సాధిస్తేనే గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు.

పిచ్, వాతావరణం
పూర్తిగా కొత్త మైదానం కాబట్టి పిచ్‌పై సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అయితే పచ్చిక తొలగించడాన్ని బట్టి చూస్తే స్పిన్‌కు అనుకూలంగా చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు కాకుండా మ్యాచ్‌ సాగినకొద్దీ దాని ప్రభావం ఉండవచ్చు. లైట్లు, పింక్‌ బాల్‌ కారణంగా పేసర్లకు కూడా కొంత అనుకూలత ఉంది. అయితే తమ చివరి పింక్‌ బాల్‌ టెస్టుల్లో భారత్‌ (36 ఆలౌట్‌), ఇంగ్లండ్‌ (58 ఆలౌట్‌) ప్రదర్శన చూస్తే దీని అనిశ్చితి ఏమిటో అర్థమవుతుంది. మ్యాచ్‌ రోజుల్లో వర్షంతో ఏమాత్రం ఇబ్బంది లేదు.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, గిల్, పుజారా, రహానే, పంత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్, అక్షర్‌ పటేల్, ఇషాంత్‌ శర్మ, బుమ్రా, ఉమేశ్‌.  
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), బెస్‌/వోక్స్, ఆర్చర్, లీచ్, అండర్సన్‌.

గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుందనేది వాస్తవం. అయితే అది మెరుపు ఉన్నంత వరకే అనేది నా అభిప్రాయం. ఆపై స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే మేం బంతి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎలా స్పందించినా, ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నాం. ప్రత్యర్థి జట్టు బలహీనతలేమిటో మాకూ తెలుసు కాబట్టి పరిస్థితులను సరిగ్గా ఉపయోగించుకుంటాం.   
– కోహ్లి, భారత కెప్టెన్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top