బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి | India Vs England 3rd Test Day 2 Match Highlights And Full Scorecard | Sakshi
Sakshi News home page

India Vs England 3rd Test Day 2 Match: బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి

Jul 11 2025 11:33 PM | Updated on Jul 12 2025 8:28 AM

India Vs England 3rd Test Day 2 Match Highlights And Full Scorecard

భారత్‌ 145/3

రాణించిన రాహుల్‌

ఇంగ్లండ్‌ 387 ఆలౌట్‌ 

రూట్‌ శతకం

నిప్పులు చెరిగిన బుమ్రా

స్మిత్, కార్స్‌ అర్ధసెంచరీలు

మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్‌ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్‌లోనూ వైవిధ్యమైన బంతులతో 
ఇంగ్లండ్‌ ప్రధాన బ్యాటింగ్‌ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్‌ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్‌ కంటే కూడా బౌలింగ్‌తోనే సత్తా చాటుకున్నాయి.  

లండన్‌: భారత ప్రీమియర్‌ బౌలర్‌ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్‌ మొదలైన కొద్దిసేపటికే అవుట్‌ చేశాడు. భారత్‌ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్‌ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.

ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్‌ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జో రూట్‌ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్‌స్టర్‌ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (113 బంతుల్లో 53 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్‌ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. 

బుమ్రా పేస్‌... స్టోక్స్, రూట్‌ క్లీన్‌బౌల్డ్‌ 
రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్‌ స్టార్‌ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ కాసేపటికే కెప్టెన్‌ స్టోక్స్‌ (44) వికెట్‌ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్‌ వికెట్‌ పడింది. ఈ ఇద్దరూ క్లీన్‌ బౌల్డయ్యారు. రూట్‌ అవుటైన మరుసటి బంతికే క్రిస్‌ వోక్స్‌ (0) డకౌట్‌ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్‌ చేశాడు. బుమ్రా పేస్‌కు విలవిలలాడిన ఇంగ్లండ్‌కు స్మిత్‌ క్యాచ్‌ నేలపాలవడం వరమైంది. సిరాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.

ఈ లైఫ్‌లైన్‌తో కార్స్‌తో కలిసి ఇంగ్లండ్‌ పోటీ స్కోరుకు స్మిత్‌ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్‌కే అతని వికెట్‌ దక్కింది. బుమ్రా... ఆర్చర్‌ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్‌ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్‌ అతన్ని అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

యశస్వి, గిల్‌ విఫలం 
ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్‌ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్‌ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వికెట్‌తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్‌కు కరుణ్‌ నాయర్‌ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్‌ వికెట్‌ తీసిన స్టోక్స్‌ రెండో వికెట్‌కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.

తర్వాత ఈ సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్‌ అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్‌ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్‌ చేయలేకపోయినా రిషభ్‌ పంత్‌ (19 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో కుదురుగా ఆడాడు.  

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) పంత్‌ (బి) నితీశ్‌ 18; డకెట్‌ (సి) పంత్‌ (బి) నితీశ్‌ 23; పోప్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) జడేజా 44; జో రూట్‌ (బి) బుమ్రా 104; బ్రూక్‌ (బి) బుమ్రా 11; స్టోక్స్‌ (బి) బుమ్రా 44; స్మిత్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) సిరాజ్‌ 51; వోక్స్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) బుమ్రా 0; కార్స్‌ (బి) సిరాజ్‌ 56; ఆర్చర్‌ (బి) బుమ్రా 4; బషీర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్‌) 387.
వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.
బౌలింగ్‌: బుమ్రా 27–5–74–5, ఆకాశ్‌దీప్‌ 23–3–92–0, సిరాజ్‌ 23.3–6–85–2; నితీశ్‌ కుమార్‌ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్‌ 10–1–21–0. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (బ్యాటింగ్‌) 53; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; గిల్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ (బ్యాటింగ్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.
బౌలింగ్‌: వోక్స్‌ 13–1–56–1, ఆర్చర్‌ 10–3–22–1, కార్స్‌ 8–1–27–0, స్టోక్స్‌ 6–2–16–1, బషీర్‌ 6–1–22–0.  

37 టెస్టుల్లో జో రూట్‌ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్‌ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ (51), జాక్వస్‌ కలిస్‌ (45), రికీ పాంటింగ్‌ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా జో రూట్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్‌లతో రాహుల్‌ ద్రవిడ్‌ (భారత్‌) పేరిట ఉన్న రికార్డును రూట్‌ సవరించాడు.

11 భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా స్టీవ్‌ స్మిత్‌ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్‌ (11) సమం చేశాడు.

4 లార్డ్స్‌ మైదానంలో వరుసగా మూడు 
సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రూట్‌ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్‌ వాన్, జాక్‌ హాబ్స్, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఈ ఘనత సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement