Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌కు జట్లను ప్రకటించిన భారత్‌..

India name 20 member Squad for chess Olympiad - Sakshi

చెన్నై: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత జట్లను అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు.

రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్‌ తరఫున ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్‌ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్‌’ హోదాలో మార్గనిర్దేశనం చేయనుండటం విశేషం. ‘గత కొంత కాలంగా నేను చాలా తక్కువ టోర్నీల్లోనే పాల్గొంటున్నాను. పైగా ఎన్నో ఒలింపియాడ్స్‌ ఆడాను కాబట్టి కొత్తతరం ఆటగాళ్లు బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా విశ్వనాథన్‌ ఆనంద్‌ వ్యాఖ్యానించాడు.

ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లతో టీమ్‌ ‘ఎ’ను, వర్ధమాన ఆటగాళ్లతో టీమ్‌ ‘బి’ను ఎంపిక చేశారు. 2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన టోర్నీలో రష్యాతో భారత్‌ సంయుక్త విజేతగా (2020) నిలువగా... 2021లో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది.  
భారత జట్ల వివరాలు 
ఓపెన్‌: భారత్‌ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్‌ఎల్‌ నారాయణన్‌. భారత్‌ ‘బి’: నిహాల్‌ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్‌ సాధ్వాని. మహిళలు: భారత్‌ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి. భారత్‌ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top