breaking news
P Harikrishna
-
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా
Chess Olympiad 2022: చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా కొనసాగుతుంది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు పరాజయం అన్నది లేకుండా దూసుకెళ్తున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో భారత జట్లు వరుసగా మూడో విజయాలు సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాయి. ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో (ఓపెన్ విభాగంలో) తెలుగు యువ కెరటాలు హరికృష్ణ, అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో భారత్ ‘ఎ’ 3–1తో గ్రీస్‌పై విజయం సాధించింది. దిమిత్రోస్‌పై హరికృష్ణ విజయం సాధించగా, అర్జున్.. మాస్తోవసిల్స్‌ను చిత్తు చేశాడు. భారత ‘బి’.. స్విట్జర్లాండ్‌పై (4–0) ఏకపక్ష విజయం నమోదు చేయగా.. భారత్ ‘సి’ 3–1తో ఐస్లాండ్పై నెగ్గింది. మహిళల విషయానికొస్తే.. భారత్ ‘ఎ’ 3–1తో ఇంగ్లండ్‌పై.. భారత్ ‘బి’ 3–1తో ఇండోనేసియాపై.. భారత్ ‘సి’ 2.5–1.5తో ఆస్ట్రియాపై గెలుపొందాయి. -
చెస్ ఒలింపియాడ్‌కు జట్లను ప్రకటించిన భారత్..
చెన్నై: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత జట్లను అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్’ హోదాలో మార్గనిర్దేశనం చేయనుండటం విశేషం. ‘గత కొంత కాలంగా నేను చాలా తక్కువ టోర్నీల్లోనే పాల్గొంటున్నాను. పైగా ఎన్నో ఒలింపియాడ్స్ ఆడాను కాబట్టి కొత్తతరం ఆటగాళ్లు బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లతో టీమ్ ‘ఎ’ను, వర్ధమాన ఆటగాళ్లతో టీమ్ ‘బి’ను ఎంపిక చేశారు. 2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్లైన్లో జరిగిన టోర్నీలో రష్యాతో భారత్ సంయుక్త విజేతగా (2020) నిలువగా... 2021లో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది. భారత జట్ల వివరాలు ఓపెన్: భారత్ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్ఎల్ నారాయణన్. భారత్ ‘బి’: నిహాల్ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని. మహిళలు: భారత్ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి. భారత్ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్. -
కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్ ‘డ్రా’
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత హరికృష్ణ 2.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.