హర్మన్, జెమీమా పోరాటం వృథా.. సెమీస్‌లో టీమిండియా ఓటమి

India fail again, lose to AUS by 5 runs in semifinal - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి

5 పరుగులతో ఆస్ట్రేలియా విజయం

హర్మన్, జెమీమా పోరాటం వృథా 

2017 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌... 2018 టి20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌... 2020 టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్‌... గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్‌ జట్టుకు వేదన మిగుల్చుతున్న నాకౌట్‌ మ్యాచ్‌ల పరాజయాల జాబితాలో మరొకటి చేరింది. ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాతో పోరులో చివరి వరకు పోరాడినా మన జట్టుకు ఓటమి తప్పలేదు. తాజా టి20 వరల్డ్‌కప్‌లో మన జట్టు ప్రస్థానం సెమీస్‌కే పరిమితమైంది. రెండు మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శనలు గెలుపు ఆశలు రేపినా... గెలుపు గీత దాటలేక జట్టు నిరాశగా నిష్క్రమించింది.   

కేప్‌టౌన్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆట ముగిసింది. గత టోర్నీ రన్నరప్‌ అయిన భారత్‌ ఈసారి సెమీఫైనల్లో ఆసీస్‌కే తలవంచింది. గురువారం ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియా 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌), మెగ్‌ లానింగ్‌ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యాష్లీ గార్డ్‌నర్‌ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఆసీస్‌ స్కోరులో కీలకపాత్ర పోషించారు.

అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఆసీస్‌కు ఇది ఏడో ఫైనల్‌ కాగా, నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో ఆదివారం తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు తలపడుతుంది.  

లానింగ్‌ జోరు... 
ఆ్రస్టేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ (26 బంతుల్లో 25; 3 ఫోర్లు), మూనీ శుభారంభం అందించారు. రేణుక వేసిన తొలి బంతినే హీలీ ఫోర్‌గా మలచడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. తొలి వికెట్‌కు 52 పరుగులు (45 బంతుల్లో) జోడించిన అనంతరం  రాధా యాదవ్‌ బౌలింగ్‌లో హీలీ స్టంపౌట్‌ అయింది. అనంతరం మూనీ, లానింగ్‌ కలిసి జట్టును నడిపించారు. భారత ఫీల్డర్లు వదిలేసిన రెండు క్యాచ్‌లు కూడా వీరికి కలిసొచ్చాయి.

సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి ఆసీస్‌ 69 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆ్రస్టేలియా జోరు పెంచింది. శిఖా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మూనీ అదే ఓవర్లో వెనుదిరిగినా... స్నేహ్‌ రాణా ఓవర్లో  లానింగ్, రాధ ఓవర్లో గార్డ్‌నర్‌ రెండేసి ఫోర్లు కొట్టారు. చివర్లో ఐదు బంతుల వ్యవధిలో భారత్‌ 2 కీలక వికెట్లు తీసినా... రేణుక వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 20 పరుగులు రాబట్టి లానింగ్‌ ఘనంగా ముగించింది. చివరి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 103 పరుగులు సాధించగా... ఇందులో ఆఖరి 5 ఓవర్లలో వచి్చన 59 పరుగులు ఉన్నాయి.  

కీలక భాగస్వామ్యం... 
భారీ ఛేదనలో భారత్‌ ఆరంభంలోనే తడబడింది. 4 ఓవర్లు ముగిసేలోపే 28 పరుగులకు టాప్‌–3 బ్యాటర్లు షఫాలీ (9), స్మృతి మంధాన (2), యస్తిక భాటియా (4) పెవిలియన్‌ చేరారు. ఈ దశలో జెమీమా, హర్మన్‌  భాగస్వామ్యం గెలుపుపై ఆశలు రేపింది. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి ధాటిగా ఆడారు. వీరి దూకుడుకు ఆసీస్‌ బౌలర్లు కొద్దిసేపు అచేతనంగా మారిపోయారు. అయితే ఇదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి  జెమీమా వెనుదిరిగింది.

నాలుగో వికెట్‌కు వీరిద్దరు 41 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. మరోవైపు హర్మన్‌ మాత్రం తగ్గకుండా చక్కటి షాట్లతో దూసుకుపోయింది. 36, 37 పరుగుల వద్ద కీపర్‌ హీలీ తన క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన హర్మన్‌ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే కీలక దశలో హర్మన్‌ రనౌట్‌ కావడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసింది. చివర్లో రిచా (14), దీప్తి శర్మ (17 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు) పోరాడినా విజయానికి అది సరిపోలేదు.  
 

హర్మన్‌ రనౌట్‌తో... 
మ్యాచ్‌కు కొద్దిసేపు క్రితం వరకు కూడా జ్వరం  కారణంగా ఆడలేని స్థితిలో ఉన్న కెప్టెన్‌ హర్మన్‌  పట్టుదలగా బరిలోకి దిగింది. మెరుపు బ్యాటింగ్‌తో విజయానికి చేరువగా తెచ్చిం ది. విజయం కోసం 33 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రెండో పరుగుకు ప్రయత్నిస్తూ క్రీజ్‌లో చేరే సమయంలో బ్యాట్‌ పిచ్‌లో ఇరుక్కుపోవడంతో హర్మన్‌ 
దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో ఆట ఆసీస్‌ వైపు మొగ్గింది.  

ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే... 

ఫీల్డింగ్‌లో వదిలేసిన రెండు క్యాచ్‌లు భారత్‌ను నష్టపరిచాయి. లానింగ్‌ 1 వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ రిచా, 32 వద్ద మూనీ క్యాచ్‌ను షఫాలీ వర్మ వదిలేశారు. వీటి నష్టం ఏకంగా 70 పరుగులు! వీటిని పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. 

స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: అలీసా హీలీ (స్టంప్డ్‌) రిచా (బి) రాధ 25; మూనీ (సి) షఫాలీ (బి) శిఖా 54; లానింగ్‌ (నాటౌట్‌) 49; గార్డ్‌నర్‌ (బి) దీప్తి 31; హారిస్‌ (బి) శిఖా 7; ఎలీస్‌ పెర్రీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–52, 2–88, 3–141, 4–148.
బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 4–0–41–0, దీప్తి శర్మ 4–0–30–1, శిఖా పాండే 4–0–32–2, రాధ యాదవ్‌ 4–0–35–1, స్నేహ్‌ రాణా 4–0–33–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (ఎల్బీ) (బి) షుట్‌ 9;  స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్‌నర్‌ 2; యస్తిక (రనౌట్‌) 4; జెమీమా (సి) హీలీ (బి) బ్రౌన్‌ 43; హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌) 52; రిచా (సి) తాలియా (బి) బ్రౌన్‌ 14; దీప్తి (నాటౌట్‌) 20; స్నేహ్‌ రాణా (బి) జొనాసెన్‌ 11; రాధ (సి) పెర్రీ (బి) గార్డ్‌నర్‌ 0; శిఖా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167.
వికెట్ల పతనం: 1–11, 2– 15, 3–28, 4–97, 5–133, 6–135, 7–157, 8– 162.
బౌలింగ్‌: యాష్లీ గార్డ్‌నర్‌ 4–0–37–2, షుట్‌ 4–0–34–1, డార్సీ బ్రౌన్‌ 4–0–18–2, ఎలీస్‌ పెర్రీ 1–0–14–0, జొనాసెన్‌ 3–0–22–1, వేర్‌హామ్‌ 3–0–29–0, తాలియా మెక్‌గ్రాత్‌ 1–0–13–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top