వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా భారీ స్కోరు.. డిక్లేర్డ్‌ | India Posts Massive 518/5 in 2nd Test vs West Indies with Gill & Jaiswal Centuries | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా భారీ స్కోరు.. డిక్లేర్డ్‌

Oct 11 2025 1:42 PM | Updated on Oct 11 2025 1:58 PM

IND vs WI 2nd Test Day 2 Jaiswal Gill Centuries India Declared Innings Score

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) శతకంతో చెలరేగడంతో భారత్‌ ఈ మేర స్కోరు సాధ్యమైంది.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా భారత్‌ వేదికగా టీమిండియా- వెస్టిండీస్‌ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్‌లో ఇరుజట్లు తలపడగా.. టీమిండియా ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 జైస్వాల్‌ భారీ శతకం
ఇక ఢిల్లీలో శుక్రవారం రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలు కాగా.. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ (38) ఊహించని విధంగా స్టంపౌట్‌ కాగా.. యశస్వి జైస్వాల్‌ మాత్రం భారీ శతకంతో విరుచుకుపడ్డాడు.

తొలి టెస్టు సెంచరీ మిస్‌
మరోవైపు.. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌ (87)కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన టీమిండియా.. శనివారం ఆట మొదలైన కాసేపటికే మూడో వికెట్‌ కోల్పోయింది.

జైసూ రనౌట్‌
175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి జైస్వాల్‌ రనౌట్‌ అయి.. డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, కెప్టెన్‌ గిల్‌ నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి 43, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ 44 పరుగులు చేసి.. అర్ధ శతకాలు పూర్తి చేసుకోకుండానే వెనుదిరిగారు.

గిల్‌ నిలకడగా
ఇక గిల్‌ మొత్తంగా 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. వెస్టిండీస్‌ బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జొమెల్‌ వారికన్‌ రాహుల్‌, సాయి, నితీశ్‌ రెడ్డి వికెట్లు తీయగా.. కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ జురెల్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్‌.. తప్పు నీదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement