Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్‌ వెళ్లి ఆడుకో​! ఇక్కడుంటే..

Ind Vs SL: Fans On No Place For Prithvi Shaw Go Play For Ireland - Sakshi

India Vs Sri Lank Series 2023: ‘‘పాపం.. అతడికి మరోసారి మొండిచేయి ఎదురైంది. శ్రీలంకతో సిరీస్‌లోనూ చోటు దక్కలేదు. జట్టులో స్థానం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. కానీ సెలక్టర్లు ఇలా వ్యవహరించడం ఏమీ బాగా లేదు. దయచేసి అతడి కెరీర్‌ నాశనం చేయకండి. మీ వైఖరి చూస్తుంటే ఈ యువ క్రికెటర్‌పై పగ బట్టినట్లుగా కనిపిస్తోంది. అసలు ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేస్తున్నారు. సెంచరీ బాదినా మీకు కనబడలేదా? అతడు ఇంకేం చేస్తే జట్టులోకి రాగలడు. 

తను చేసిన నేరమేంటి? బీసీసీఐ రాజకీయాలకు బలైపోతున్న ఆటగాళ్ల జాబితాలో తనకు మొదటి ర్యాంకు ఇవ్వాలి’’ అంటూ టీమిండియా అభిమానులు సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు. శ్రీలంకతో సిరీస్‌ నేపథ్యంలో యువ బ్యాటర్‌ పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైన విషయం తెలిసిందే.


పృథ్వీ షా

గతేడాది చివరిసారిగా..
వన్డే, టీ20.. ఏ జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. దేశవాళీ​ టోర్నీల్లో రాణిస్తున్నప్పటికీ ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌కు గత కొంతకాలంగా సెలక్టర్లు మొండిచేయి చూపుతూనే ఉన్నారు. గతేడాది జూలైలో శ్రీలంక పర్యటన తర్వాత పృథ్వీకి అవకాశాలు కరువయ్యాయి.

ఐర్లాండ్‌ వెళ్లిపో
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఇలాంటి చేదు అనుభవమే ఎదురుకావడంతో నెటిజన్లు అతడి పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. ‘‘పృథ్వీని కాదని రుతు, గిల్‌లకు అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఈ విధ్వంసకర ఓపెనర్‌ను పట్టించుకోవడం లేదు. నువ్వు కూడా ఆ ఉన్ముక్త్‌ చంద్‌లాగే ఏ అమెరికాకో.. ఐర్లాండ్‌కో వెళ్లి టోర్నీలు ఆడుకో. ఇక్కడుంటే నీ ప్రతిభను ఎవరూ పట్టించుకోరు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా అక్టోబరులో జరిగిన దేశవాళీ టీ20 టోర్నీలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 61 బంతుల్లోనే 134 పరుగులు సాధించాడు పృథ్వీ షా. అస్సాంతో మ్యాచ్‌లో ఈ ముంబై కెప్టెన్‌ 13 ఫోర్లు, 9 సిక్సర్లతో పొట్టి ఫార్మాట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.

ఇక లంకతో టీ20 సిరీస్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం దక్కడం గమనార్హం. మరోవైపు.. టీ20 సిరీస్‌ జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కినా వన్డేల్లో మాత్రం స్థానం దక్కలేదు.

చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌ అతడే! గర్వం తలకెక్కితే మాత్రం..
Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్‌ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top