
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడేందుకు ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి (సెప్టెంబరు 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సబా కరీం, ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అతడికి తిరుగులేదు
టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం మాట్లాడుతూ.. భారత్- పాక్ మ్యాచ్‌లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ‘‘పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది- టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్‌ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇక కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయబోతున్నాడదనేది కూడా ఆసక్తికరం. బుమ్రా గురించి మాత్రం నేను మాట్లడను. ఎందుకంటే.. అతడికి తిరుగులేదు. ఎవరితో పోటీ కూడా లేదు. ఈసారి పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందనే అనుకుంటున్నా.
ఏకపక్ష విజయం
టీమండియా ఏకపక్ష విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జట్టు పటిష్టంగా ఉంది. అందుకే సులువుగానే గెలుస్తారని నమ్ముతున్నా’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అయితే, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
ఆఖరి వరకు సాగాలి.. ఊరించి గెలవాలి
‘‘భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగాలి. టీ20 ప్రపంచకప్-2022లో చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ బుమ్రా హీరో అయ్యాడు. ఈసారి కూడా పాక్‌ను ఊరించి మరీ టీమిండియా విజయం సాధించాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించాడు.
కాగా 2022 ప్రపంచకప్‌లో భారత్ ఆఖరి బంతికి పరుగు తీసి.. పాక్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2024 వరల్డ్‌కప్ టోర్నీలో ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. ఈసారి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఏఈపై అద్భుత విజయం సాధించగా.. పాక్ ఒమన్‌ను ఓడించింది.
బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్లు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ టోర్నీ కావున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాయాదుల పోరుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి.
చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు