IND VS BAN 1st ODI: కొంపముంచిన కేఎల్‌ రాహుల్‌.. టీమిండియా ఓటమికి ప్రధాన కారణమయ్యాడు

IND VS BAN 1st ODI: KL Rahul Dropped Crucial Mehidy Hasan Catch, Which Cost India Defeat - Sakshi

3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్‌ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 4) జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్‌ తేడాతో ఓటమిపాలైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో.. బంగ్లా బ్యాటర్‌ మెహిది హసన్‌ (38 నాటౌట్‌), టెయిలెండర్‌ ముస్తాఫిజుర్‌ (10 నాటౌట్‌) సహకారంతో బంగ్లాదేశ్‌కు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెహిది, ముస్తాఫిజుర్‌ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా విజయావకాశాలపై నీళ్లు చాల్లారు. 

136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ను భారత ఫీల్డర్లు తమకు మాత్రమే సాధ్యమైన చెత్త ప్రదర్శనతో గెలిపించారు. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్‌ విజయానికి దోహదపడ్డారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ కీలక సమయంలో మెహిది హసన్ క్యాచ్‌ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.

42.3వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేవగా, సునాయాసంగా అందుకోవాల్సిన క్యాచ్‌ను రాహుల్‌ జారవిడిచాడు. అప్పటికి బంగ్లాదేశ్‌ విజయానికి ఇంకా 32 పరుగులు (155/9) అవసరం ఉండింది. ఈ క్యాచ్‌ను రాహుల్‌ పట్టుకున్నట్లయితే టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. రాహుల్‌ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన మెహిది హసన్.. ముస్తాఫిజుర్‌ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. బంగ్లా బౌలర్లు షకీబ్‌ అల్‌ హసన్‌ (5/36), ఎబాదత్‌ హొస్సేన్‌ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్‌ ధవన్‌ (7), కోహ్లి (9), షాబాజ్‌ అహ్మద్‌ (0), శార్ధూల్‌ ఠాకూర్‌ (2), దీపక్‌ చాహర్‌ (0), సిరాజ్‌ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. టీమిండియా బౌలర్లు సిరాజ్‌ (3/32), కుల్దీప్‌ సేన్‌ (2/37), సుందర్‌ (2/17), శార్ధూల్‌ ఠాకూర్‌ (1/15), దీపక్‌ చాహర్‌ (1/32) దెబ్బకు 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ.. మెహిది హసన్‌, ముస్తాఫిజుర్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు చారిత్రక విజయాన్ని (46 ఓవర్లలో 187/9) అందించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా డిసెంబర్‌ 7న జరుగనుంది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top