
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో నామమాత్రపు మూడో యూత్ వన్డే (IND U19 vs AUS U19 3rd ODI)లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విఫలమయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో అదరగొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈసారి మాత్రం పదహారు పరుగులకే పరిమితమయ్యాడు.
ఇక.. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6, 0, 4)బ్యాట్‌తో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. టాపార్డర్‌లో ఇలా ఓపెనర్లు నిరాశపరిచినా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (40) మాత్రం ఫర్వాలేదనిపించాడు.
అదరగొట్టిన వేదాంత్, రాహుల్
అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్లో వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్ (Rahul Kumar) అదరగొట్టడంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వేదాంత్ 92 బంతుల్లో 86, రాహుల్ కుమార్ 84 బంతుల్లో 62 పరుగులు సాధించారు. మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ హర్‌వన్ష్ పంగాలియా 23, ఖిలాన్ పటేల్ 20* పరుగులు చేశారు.
ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసే సరికి భారత అండర్-19 జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆసీస్ యువ బౌలర్లలో విల్ బిరోమ్, కేసీ బార్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చార్ల్స్ లాచ్‌మండ్, బెన్ గోర్డాన్, కెప్టెన్ విల్ మలాజుక్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇప్పటికే సిరీస్ 2-0తో కైవసం
కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
ఇక శుక్రవారం నాటి మూడో యూత్ వన్డేలోనూ బ్యాటింగ్ పరంగా మరోసారి దుమ్మురేపింది. ఇక బౌలర్ల పనే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 68 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.
చదవండి: అందుకే షమీని సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్