Mehar Chhayakar Banned: భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం

ICC Banned UAE Mehar Chhayakar All-Forms-Cricket-14 Years Match-fixing - Sakshi

భారత సంతతికి చెందిన యూఏఈ క్రికెటర్‌ మెహర్‌ చాయ్‌కర్‌పై ఐసీసీ 14 ఏళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్‌ ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడడం.. వీటితో పాటు ఐసీసీ నియమావళికి చెందిన ఏడు నిబంధనలు, కెనడా క్రికెట్‌ ఆంక్షలను ఉల్లఘించినందుకు గానూ మెహర్‌ చాయ్‌కర్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ బుధవారం పేర్కొంది.

విషయంలోకి వెళితే.. 2018లో జింబాబ్వే, యూఏఈల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో పాటు అదే ఏడాది కెనడాలో జరిగిన గ్లోబల్‌ టి20 టోర్నీల్లో  మెహర్‌ చాయ్‌కర్‌ బుకీలను సంప్రదించి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్‌ ట్రిబ్యునల్‌ మెహర్‌ చాయ్‌కర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. తమ విచారణలో మెహర్‌ చాయ్‌కర్‌ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని.. దీంతో పాటు క్రికెట్‌లో పలు నిబంధనలను గాలికొదిలేసినట్లు మా దృష్టికి వచ్చిందని యాంటీ ట్రిబ్యునల్‌ తెలిపింది. మెహర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై 14 సంవత్సరాలు నిషేధం విధించినట్లు ట్రిబ్యునల్‌ పేర్కొంది.

ఐసిసి జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. "2018లో అజ్మాన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో మెమర్‌ చాయ్‌కర్‌ తొలిసారి అవినీతికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుకీలతో స​ంప్రదింపులు జరిపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడడం వంటివి చేశాడు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని అతనిపై 14 సంవత్సరాల నిషేధం విధించాం. క్రికెట్‌ను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించే ఆటగాళ్ల పట్ల కనికరం చూపించం. అవినీతికి పాల్పడేవారిపై ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటాం'' అని హెచ్చరించాడు.

మెమర్‌ చాయకర్‌ ఉల్లఘించిన క్రికెట్‌ నిబంధనలు ఇవే..
►ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఏ విధంగానైనా కుట్రకు పాల్పడడం లేదా తప్పుగా ప్రభావితం చేయడం.. ఫిక్సింగ్‌కు పాల్పడడం ద్వారా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రదర్శన చేయడం
►ఆర్టికల్ 2.1.4 ప్రకారం.. ఒక ఆటగాడిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అభ్యర్థించడం, ప్రేరేపించడం, ప్రలోభపెట్టడం, సూచించడం, ఒప్పించడం 
►ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు సహకరించకుండా సమాధానాలు దాటవేయడం, తప్పును కప్పిపుచ్చుకోవడం
►ఆర్టికల్ 2.4.7 – ఏదైనా డాక్యుమెంటేషన్‌ను దాచిపెట్టడం, తారుమారు చేయడం లేదా నాశనం చేయడం.. దర్యాప్తును అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడం

అయితే యూఏఈ క్రికెట్‌లో ఆటగాళ్లపై నిషేధం కొత్త కాదు. ఇప్పటికే నలుగురు యూఏఈ క్రికెటర్లు ఐసీసీ బ్యాన్‌ను ఎదుర్కొంటున్నారు. తొలిసారి మార్చి 2021లో యూఏఈ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ నవీన్‌తో పాటు బ్యాటర్‌ షైమన్‌ అన్వర్‌లపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం ఉంది. ఆ తర్వాతి నెలలో మరో ఆటగాడు ఖదీర్‌ అహ్మద్‌పై ఐదు సంవత్సరాల నిషేధం.. గతేడాది సెప్టెంబర్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ యూఏఈ వికెట్‌ కీపర్‌ గులామ్‌ షబ్బీర్‌పై నాలుగేళ్ల నిషేధం పడింది. తాజాగా వీరి సరసన భారత సంతతికి చెందిన మెహర్‌ చాయ్‌కర్‌ వీరితో చేరాడు.

చదవండి: ఫిట్‌నెస్‌ టెస్టులో క్లియరెన్స్‌.. ఆస్ట్రేలియాకు షమీ

అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్‌ ఫించ్‌.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top