టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్‌ స్టార్‌ | Hardik Pandya gets fitness clearance for AFG series, ready to return to ODIs after 1 year | Sakshi
Sakshi News home page

IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్‌ స్టార్‌

Jun 6 2026 10:36 AM | Updated on Jun 6 2026 11:25 AM

Hardik Pandya gets fitness clearance for AFG series, ready to return to ODIs after 1 year

అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊర‌ట ల‌భించింది.  ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గోనేందుకు స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుండి అనుమతి లభించింది.

దీంతో దాదాపు ఏడాది త‌ర్వాత పాండ్యా వ‌న్డేల్లో ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. కాగా గ‌త నెల‌లో అఫ్గాన్‌తో సిరీస్‌కు ప్ర‌క‌టించిన 15 మంది స‌భ్యుల భార‌త జ‌ట్టులో పాండ్యాకు చోటు ద‌క్కింది. కానీ వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్న పాండ్యాకు  ఈ సిరీస్ ఆరంభానికి ముందు త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల‌ని సెల‌క్ట‌ర్లు కండీష‌న్ పెట్టారు. 

దీంతో జూన్ 2న బెంగ‌ళూరులోని సీఓఈకి వెళ్లిన పాండ్యాకు వైద్యులు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇందులో అత‌డు ఉత్తీర్ణ‌త సాధించ‌డంతో సీఓఈ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. మరోవైపు తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.

ఇందులో పాసైతేనే అఫ్గాన్‌తో సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో సెలక్షన్ కమిటీ భర్తీ చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే టీమిండియా స్టార్‌, రన్‌మిషన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. కోహ్లి ప్రస్తుతం  కాలి పిక్క కండ‌రాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని రుతురాజ్ గైక్వాడ్‌తో భర్తీ చేశారు.

పాండ్యా విష‌యానికి వ‌స్తే.. చివరిసారిగా 2025 మార్చిలో భార‌త్ త‌ర‌పున‌ వన్డే మ్యాచ్‌ ఆడాడు. పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలు ఆడి, 32.82 సగటుతో 1904 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి పేరిట 91 వన్డే వికెట్లు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి. వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.

అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ*, రుతురాజ్ గైక్వాడ్‌, శ్రేయాస్ అయ్యర్ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే
చదవండి: ENG vs NZ: ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

 

Advertisement
 
Advertisement
Advertisement