అందుకే కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టాం: శుబ్‌మన్‌ గిల్‌ | Gill Explains Why is Kuldeep Yadav Not Playing ENG vs IND 2025 2nd Test | Sakshi
Sakshi News home page

అందుకే కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టాం: శుబ్‌మన్‌ గిల్‌

Jul 2 2025 4:10 PM | Updated on Jul 2 2025 4:36 PM

Gill Explains Why is Kuldeep Yadav Not Playing ENG vs IND 2025 2nd Test

టీమిండియా- ఇంగ్లండ్‌ (India vs England) మధ్య రెండో టెస్టు నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన పేరు కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav). ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌పై ఈ చైనామన్‌ స్పిన్నర్‌ను ఆడిస్తే భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌తో పాటు.. సునిల్‌ గావస్కర్‌ వంటి భారత దిగ్గజ క్రికెటర్లు కూడా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించారు.

అతడికి విశ్రాంతి.. వారిపై వేటు
అయితే, రెండో టెస్టు ఆడే జట్టులో మాత్రం కుల్దీప్‌ యాదవ్‌కు చోటు దక్కలేదు. ఈ మణికట్టు స్పిన్నర్‌కు బదులు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)కు సెలక్టర్లు తుదిజట్టులో స్థానం ఇచ్చారు. తొలి టెస్టులో ఆడిన ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పాటు.. సాయి సుదర్శన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లపై వేటు వేశారు.

ఈ ముగ్గురి స్థానంలో పేసర్‌ ఆకాశ్‌ దీప్‌తో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో జట్టులో చేసిన మార్పుల గురించి స్పందించిన టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.

అందుకే కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టాం
‘‘ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రెడ్డి, వాషీలతో పాటు ఆకాశ్‌ దీప్‌ జట్టులోకి వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించడం లేదు. అతడి వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.

మూడో టెస్టు లార్డ్స్‌లో జరుగనుంది. అక్కడ బుమ్రా అవసరం మాకు ఎక్కువగా ఉంటుంది. అక్కడి పిచ్‌ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. అందుకే ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చాం.

ఇక కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకోవాలని ఆఖరి వరకు అనుకున్నాం. అయితే, బ్యాటింగ్‌లో డెప్త్‌ గురించి ఆలోచించి అతడిని పక్కనపెట్టాం. ’’ అని శుబ్‌మన్‌ గిల్‌ వెల్లడించాడు. గత మ్యాచ్‌లో తమ లోయర్‌ ఆర్డర్‌ దారుణంగా విఫలమైందని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.  కాగా గతంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ కుల్దీప్‌ యాదవ్‌కు మొదట ప్రాధాన్యం ఇవ్వలేదు మేనేజ్‌మెంట్‌.

భారత గడ్డపై ఇలా
ఈ క్రమంలో హైదరాబాద్‌ వేదికగా తొలి టెస్టు ఓడిన తర్వాత.. రెండో మ్యాచ్‌ నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. తదుపరి నాలుగు మ్యాచ్‌లలో కుల్దీప్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి మొత్తంగా 19 వికెట్లు కూల్చాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్‌పై 4-1తో గెలిచి సిరీస్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 

అయితే, ప్రస్తుతం సిరీస్‌ ఇంగ్లండ్‌లో జరుగుతున్నందున అతడికి ఎక్కువగా అవకాశం రాకపోవచ్చు. కానీ ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ స్వభావాన్ని బట్టి కుల్దీప్‌ను ఆడిస్తారని అంతా భావించారు. కాగా ఆండర్సన్‌-టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. 

ఐదు శతకాలు బాదినా
ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ సెంచరీలు కొట్టగా.. రిషభ్‌ పంత్‌ రెండు శతకాలతో అలరించాడు. అయితే, అప్పుడు కూడా బ్యాటింగ్‌ డెప్త్‌ కోసమని శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకోగా.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. 

మొత్తంగా ఐదు పరుగులు చేయడంతో పాటు కేవలం రెండు వికెట్లే పడగొట్టగలిగాడు.  కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య బుధవారం (జూలై 2) రెండో టెస్టు ఆరంభం కాగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 8.4 ఓవర్‌ వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (2) బౌల్డ్‌ కాగా.. యశస్వి జైస్వాల్‌ 12 పరుగులతో ఉన్నాడు. భారత్‌ స్కోరు: 15/1 (8.4).

చదవండి: IND vs ENG T20Is: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్‌.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement