Pele: దిగ్గజం పీలే పరిస్థితి విషమం.. వార్తలను ఖండించిన కూతురు

Football Legend Pele Hospitalised Daughter Confirms No Emergency - Sakshi

బ్రెజిల్‌  ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం హల్‌చల్‌ చేయడంతో పీలే కూతురు కెలీ నాసిమెంటో వార్తలను ఖండించింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత తండ్రి ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చింది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ హాస్పిటల్‌లో చేరిన పీలేకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఆ తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

"మా నాన్నా ఆరోగ్యం గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసమే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదు. భయపడాల్సింది కూడా లేదు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్‌ చేస్తాను" అని నాసిమెంటో ఇన్‌స్టాలో పేర్కొంది.

గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల పీలే పెద్ద పేగు నుంచి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవుతూ, వస్తూ ఉన్నాడు. అతనికి కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, కీమో థెరపీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని ఈఎస్పీఎన్‌ బ్రెజిల్ తన కథనంలో పేర్కొంది.

ఇక ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచాడు. తన కెరీర్‌లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్‌ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్‌ రికార్డు కావడం విశేషం. ఇక బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్‌ చేశాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top