Lionel Messi: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!

FIFA WC: Messi Son Throws Chewing-Gum At Fans-ARG Vs AUS R-16 Match - Sakshi

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వవ్యాప్తంగా మెస్సీకి యమా క్రేజ్‌ ఉంది. క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా ఫ్యాన్‌ బేస్‌ కలిగిన మెస్సీ చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా జట్టుకు ఫిఫా టైటిల్‌ అందించాలనే లక్ష్యంతోనే మెస్సీ బరిలోకి దిగినట్లుగా అనిపిస్తుంది.

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేర్చాడు. మరో మూడు అడుగులు దాటితే కప్‌ అర్జెంటీనా సొంతం అవుతుంది. అయితే నాకౌట్‌ దశ కావడంతో ఒక్క మ్యాచ్‌ ఓడినా ఇంటిబాట పట్టాల్సిందే. ఈ స్థితిలో మెస్సీ ఎలా జట్టును ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో మూడు గోల్స్‌ సాధించిన మెస్సీ ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది గోల్స్‌ నమోదు చేశాడు.

ఈ విషయం పక్కనబెడితే.. ఆటలో మెస్సీ రారాజు మాత్రమే కాదు.. ప్రశాంతతకు మారుపేరు. మ్యాచ్‌ సమయంలో అతను సహనం కోల్పోయింది చాలా తక్కువసార్లు అని చెప్పొచ్చు. అయితే మెస్సీ కొడుకు మాత్రం అల్లరిలో కింగ్‌లా కనిపిస్తున్నాడు. శనివారం అర్థరాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌కు మెస్సీ భార్య అంటోనిలా రొక్కుజో తన కుమారుడితో హాజరయ్యింది. మ్యాచ్‌లో 35వ నిమిషంలో మెస్సీ గోల్‌ చేసినప్పుడు కొడుకుతో కలిసి సంతోషాన్ని పంచుకున్న అంటోనిలా మెస్సీకి ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కాసేపటికే మెస్సీ కొడుకు తనలోని తుంటరితనాన్ని బయటికి తీశాడు. 

నోటిలో ఉన్న చూయింగ్‌ గమ్‌ను బయటకు తీసి తన ఎదురుగా ఫ్యాన్స్‌పైకి విసిరేశాడు. ఈ చర్యతో షాక్‌ తిన్నా వాళ్లు వెనక్కి తిరిగి చూడగా.. చేసింది మెస్సీ కొడుకని తెలుసుకొని ఏమీ అనలేకపోయారు. అయితే తల్లి అంటోనిలా రొక్కుజో మాత్రం కొడుక్కి చివాట్లు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియో చూసిన అభిమానులు.. ఫన్నీ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ''మెస్సీ వారసుడు అంటున్నారు.. అతని లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ పిల్లాడి వల్ల చాలా ముప్పు.. వెంటనే స్కూల్‌కు పంపించేయండి.. వాళ్ల నాన్న కనిపించేసరికి అతనిపై వేద్దామనుకున్నాడు.. కానీ మిస్‌ అయిపోయింది..'' అంటూ పేర్కొన్నారు. ఇక ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన మెస్సీ బృందం డిసెంబర్‌ 10న జరగనున్న క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ మెస్సీ కెరీర్‌లో 1000వ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో గోల్‌ చేసిన మెస్సీ దిగ్గజం మారడోనా రికార్డును బద్దలు కొట్టాడు.

చదవండి: 60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్‌ ఫుట్‌బాలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top