FIFA WC 2022: ఫిఫా ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం

FIFA WC: Intresting Facts About How FIFA Make Money From Football - Sakshi

ఇప్పుడంటే క్రికెట్‌లో ఐపీఎల్‌కు కాసుల వర్షం కురుస్తోంది కానీ ఫుట్‌బాల్‌లో అలా కాదు. కొన్ని దశాబ్దల కిందటి నుంచే ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌ ఆదాయం తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌ ఎడిషన్స్‌ అన్నింటిని కలిపినా కూడా ఫిఫా వరల్డ్‌కప్‌లో వచ్చే ఆదాయంలో సగం కూడా ఉండదు. అంత క్రేజ్‌ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ మరొక రోజులో ఖతార్‌ వేదికగా మొదలుకానుంది. మరి ఫిఫాకు వస్తున్న ఆదాయం ఎంత.. ఈ స్థాయిలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకుందాం.

2018లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌కు రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ఆ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ విజేతగా నిలవగా.. క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆ వరల్డ్‌కప్‌లో ఫిఫాకు వచ్చిన ఆదాయం 460 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో సుమారుగా రూ.37,500 కోట్లు. ఇప్పుడు ఖతార్‌ వరల్డ్‌కప్‌లోనూ మొత్తంగా 44 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తోంది. అందులో విజేతకే 4.4 కోట్ల డాలర్లు దక్కుతుంది. మన కరెన్సీలో సుమారు రూ.358 కోట్లు. ఇక నాలుగేళ్లకోసారి ఫిఫా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా 2015-18 కాలానికిగాను ఫిఫా మొత్తంగా 640 కోట్ల డాలర్లు (సుమారు రూ.52 వేల కోట్లు) సంపాదించింది. 

ఫుట్‌బాల్‌ వ్యవహారాలు చూసుకునే సంస్థ ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (FIFA).. ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ సహా, నిర్వాహక దేశం ఆర్గనైజింగ్‌ కమిటీకి, రవాణాకు, టీమ్స్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ వసతి ఏర్పాట్లకు, ఆతిథ్య దేశంలో ఫుట్‌బాల్‌ అభివృద్ధికి ఇలా ఎంతో ఖర్చు చేస్తుంది. ఈ విశ్వంలో ఎక్కువమంది చూసే ఆటగా పేరున్న ఫుట్‌బాల్‌లో ఫిఫా సంపాదన కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. 

ఫిఫా ఆదాయం ఇలా
ఫిఫా సంపాదనలో చాలా వరకూ టీవీ హక్కుల అమ్మకం ద్వారానే వస్తుంది. వరల్డ్‌కప్‌, ఇతర ఇంటర్నేషనల్ టోర్నీల టీవీ హక్కులను ఫిఫా భారీ మొత్తానికి అమ్ముతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు 640 కోట్ల ఆదాయంలో 460 కోట్లు కేవలం టీవీ హక్కుల ద్వారానే రావడం విశేషం. ఇక మార్కెటింగ్‌ హక్కుల ద్వారా కూడా ఫిఫా పెద్ద మొత్తమే అందుకుంటుంది.

వరల్డ్‌కప్‌లాంటి మెగా ఈవెంట్లలో బడా కంపెనీలు తమ అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం భారీ మొత్తాలు ఫిఫాకు చెల్లిస్తాయి. 2015-18 నాలుగేళ్ల సైకిల్‌లో ఫిఫాకు ఇలా మార్కెటింగ్‌ హక్కుల అమ్మకం ద్వారా ఏకంగా 166 కోట్ల డాలర్ల (సుమారు రూ.13500 కోట్లు) ఆదాయం వచ్చింది.ఇక టికెట్ల అమ్మకాలు, ఆతిథ్యం ద్వారా కూడా ఫిఫాకు కొంత ఆదాయం సమకూరుతుంది. అయితే టీవీ, మార్కెటింగ్‌ హక్కులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2015-18 సైకిల్‌లో వీటి ద్వారా ఫిఫాకు 7.12 కోట్ల డాలర్లు (సుమారు రూ.580 కోట్లు) సమకూరింది.

ఫిఫా తన పేరును వాడుకోవడానికి కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తుంది. వీడియో గేమ్స్‌ చేసే ఈఏ 20 ఏళ్లకుగాను ఫిఫా పేరు వాడుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఏడాదికి 15 కోట్ల డాలర్లు ఫిఫాకు చెల్లిస్తుంది. గతేడాది లైసెన్సింగ్‌, మర్చండైజ్‌, రీటెయిల్‌, గేమింగ్‌ ద్వారా ఫిఫాకు 18 కోట్ల డాలర్లు వచ్చాయి.

చదవండి: ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్‌ జెట్స్‌ సాయంతో ఖతార్‌కు

అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top