
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వారసుడు ఆర్యవీర్ (Aaryavir Sehwag) సెహ్వాగ్ లీగ్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ధనాధన్ ఆడి.. శుభారంభం అందుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025లో భాగంగా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున ఆర్యవీర్ బుధవారం అరంగేట్రం చేశాడు.
వరుసగా రెండు బౌండరీలు
ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా పేసర్ నవదీప్ సైనీ (Navdeep Saini) బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది ఆర్యవీర్ తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అయితే, మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న ఈ జూనియర్ సెహ్వాగ్ నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
ఏదేమైనా.. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రి వీరేందర్ సెహ్వాగ్‌ను గుర్తుచేస్తూ అభిమానులను అలరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యశ్ ధుల్ దులిప్ ట్రోఫీ కారణంగా ఈ మ్యాచ్ మిస్సయ్యాడు.
ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాను
మా జట్టు గత మ్యాచ్ పూర్తైన తర్వాతే.. ధుల్ స్థానంలో నేను ఆడబోతున్నానని తెలిసింది. జాంటీ భయ్యా వచ్చి నాకు ఈ విషయం ఈ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఆడటం బాగా అనిపించింది.
బౌండరీలు బాదడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాను. తదుపరి మ్యాచ్‌లో మరింత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నా’’ అని ఆర్యవీర్ తెలిపాడు.
నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదు
ఇక తండ్రి వీరేందర్ సెహ్వాగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదు కదా!’’ అంటూ ఆర్యవీర్ నవ్వులు చిందించాడు. తండ్రి నుంచి తప్పక ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని తెలిపాడు.
కేవలం ఆట మీద మాత్రమే దృష్టి
అదే విధంగా.. ‘‘మమ్మల్ని, మా ఆట తీరును అందరూ గమనిస్తూ ఉంటారని తెలుసు. స్కౌట్స్ మా ప్రదర్శనను విశ్లేషిస్తూ ఉంటారు. అయితే, ఆ విషయం గురించి మేము ఎక్కువగా ఆలోచించము. ఒకవేళ అలా చేసినట్లయితే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి.. మైదానంలో కేవలం ఆట మీద మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్‌లో ఆడాలన్న తన కల గురించి చెప్పుకొచ్చాడు.
కాగా భారత ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన వీరేందర్ సెహ్వాగ్‌కు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆర్యవీర్. చిన్నోడు వేదాంత్. ఆర్యవీర్ దేశీ క్రికెట్‌లో ఇప్పటికే సత్తా చాటుతున్నాడు. డీపీఎల్ వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని ఎనిమిది లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది.
చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్