టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి.. పాక్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు | Fastest women's T20I fifty: Pakistan skipper breaks world record | Sakshi
Sakshi News home page

టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి.. పాక్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

May 16 2026 11:49 AM | Updated on May 16 2026 11:52 AM

Fastest women's T20I fifty: Pakistan skipper breaks world record

పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనా టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నిన్న (మే 15) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన ఆమె.. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ద సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. 

గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, భారత్‌కు చెందిన రిచా ఘోష్‌ పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ ముగ్గురు 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. తాజాగా ఫాతిమా సనా వీరి రికార్డును బద్దలు కొట్టి సింగిల్‌గా ప్రపంచ రికార్డు సెట్‌ చేసింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో పాక్‌ 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్‌ 3-0తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా పాక్‌ 3-0తో ఊడ్చేసింది. ఈ వైట్‌బాల్‌ సిరీస్‌ల కోసం జింబాబ్వే తొలిసారి పాక్‌లో పర్యటించింది.

నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఫాతిమా సనా 19 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి పాక్‌ భారీ స్కోర్‌ చేసేందుకు దోహదపడింది. ఫాతిమాకు ముందు సైరా జబీన్‌ (50 నాటౌట్‌), అయేషా జాఫర్‌ (45) కూడా సత్తా చాటారు. మిగతా బ్యాటర్లలో మునీబా అలీ 22, నతాలియా పర్వేజ్‌ 1, ఇరామ్‌ జావెద్‌ 29 పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో జింబాబ్వే 200 పరుగుల మార్కు దాటడం ఇది రెండోసారి.

224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఎప్పటిలాగే తడబడింది. 17.1 ఓవర్లలో 90 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా భారీ తేడాతో పరాజయంపాలైంది. సదియా ఇక్బాల్‌ 3, నష్రా సంధు 2, ఫాతిమా సనా, రమీన్‌ షమీమ్‌, తుబా హస్సన్‌ తలో వికెట్‌ తీసి జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెలిస్‌ (32), అదెల్‌ జిమును (18), మిచెల్‌ మవుంగా (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement