T20 World Cup 2022: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్‌ 9న డెడ్‌లైన్‌!

Fans Demand India Still Include Shami T20 WC Squad What ICC Rule Says - Sakshi

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ టి20 ప్రపంచకప్‌కు స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే స్టాండ్‌ బై ప్లేయర్‌గా కాకుండా షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆసీస్‌తో జరిగిన టి20 సిరీస్‌కు దూరమైన షమీ ఇంకా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది.

ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు మరో నెలరోజులు సమయం ఉండడంతో ఈలోగా షమీ కోలుకుంటే స్టాండ్‌ బై ప్లేయర్‌ నుంచి ప్రధాన జట్టులోకి తీసుకోవాలని అభిమానులు సహా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఉంటే.. ప్రధాన జట్టులో ఎవరైనా గాయపడితేనే అప్పుడు టీంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో షమీ టి20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉ‍న్నప్పటికి మ్యాచ్‌ ఆడే అవకాశం ఉండదు. 

అయితే ఆస్ట్రేలియాలోని పిచ్‌లు షమీకి సరిగ్గా సరిపోతాయని.. అతను వేసే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ డెలివరీలు ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడం ఖాయమని భావిస్తున్నారు. హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌లు విఫలమవుతున్న వేళ షమీ లాంటి పేసర్‌ సేవలు ఆస్ట్రేలియాలో ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. మరి స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఉన్న మహ్మద్‌ షమీని టీమిండియా ప్రధాన జట్టులోకి తీసుకోవచ్చా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది.

ఐసీసీ రూల్స్‌ ప్రకారం అక్టోబర్‌ 9 వరకు టి20 ప్రపంచకప్‌ ఆడనున్న ఆయా జట్లు తమ టీంలో మార్పులు.. చేర్పులు చేసుకోవచ్చు. అయితే ఎంపిక చేయాలనుకున్న ఆటగాడు ఎలాంటి గాయాలతో బాధపడకూడదు.. కచ్చితంగా ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు రూల్స్‌ సరిగ్గా ఉంటే ఏ జట్టైనా తమ టీంను మార్చుకునే హక్కు ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఇక డెడ్‌లైన్‌(అక్టోబర్‌ 9) ముగిసిన తర్వాత ఐసీసీ అనుమతి తీసుకోవాల్సిందే.

ఇక టీమిండియాతో ముగిసిన టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ కామెరున్‌ గ్రీన్‌ అదరగొట్టాడు. రెండు అర్థసెంచరీలతో రాణించిన గ్రీన్‌ వాస్తవానికి టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో లేడు. అయితే అతని ఆటతీరుకు ఫిదా అయిన క్రికెట్‌ ఆస్ట్రేలియా కామెరున్‌ గ్రీన్‌కు జట్టులో చోటు కల్పించాలని భావిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతో టీమిండియా అభిమానులు కూడా షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి అభిమానుల విజ్ఞప్తిని పట్టించుకొని షమీని బీసీసీఐ ప్రధాన జట్టులోకి ఎంపిక చేస్తుందేమో చూడాలి. ఎలాగో అక్టోబర్‌ 9 వరకు సమయం ఉంది కాబట్టి ఈలోగా షమీ కోలుకుంటే ఫిట్‌నెస్‌ నిరూపించుకునే అవకాశం ఉంది. 

ఇక అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానున్న టి20 ప్రపంచకప్‌లో మొదట క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్‌లో రెండు గ్రూఫ్‌ల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-12 దశకు అర్హత సాధిస్తాయి. ఇక అసలు సమరం అయిన సూపర్‌-12 దశ అక్టోబర్‌ 23 నుంచి మొదలుకానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్‌ 24న(ఆదివారం) తలపడనుంది.

చదవండి: 'ధోని వల్లే కెరీర్‌ నాశనమైంది'.. ఇర్ఫాన్‌ పఠాన్‌ అదిరిపోయే రిప్లై

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top